Etela Rajender: బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా.. కొన్ని రోజులుగా పార్టీలో సర్దుకు పోతున్న ఆయన అధికార కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా.. గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా.. హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా అంటే అవునే సమాధానం వస్తోంది కాంగ్రెస్ వర్గాల నుంచి. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్‌కు మధ్య పొసగడం లేదని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బండి ఇటీవల ఖండించారు. కానీ అనుచరులు మాత్రం వర్గాలుగా విడిపోయారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటు ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్‌గిరి టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదని సమాచారం.
కరీంనగర్ టికెట్ అడిగిన ఈటల..
మల్కాజ్‌గిరి టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో తనకు బలమైన క్యాడర్ ఉన్న కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. ఇక్కడ కూడా బండి సంజయ్‌ను కాదని ఇతరులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని కమలనాథులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈటల బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ముహూర్తం ఫిక్స్..
తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందని, పార్టీ మారేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని వార్తలు మరోమారు చెక్కర్లు కొడుతున్నాయి. ఈమేరు ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముగ్గురూ సమావేశమయ్యారని తెలుస్తోంది.
కాంగ్రెస్ తరఫున కరీంనగర్ ఎంపీగా..
కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేడు. దీంతో ఈటలను కాంగ్రెస్‌లో చేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలో పొన్న ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత బోయినపల్లి వినోద్ బీఆర్‌ఎస్ నుంచి బండి సంజయ్ బీజేపీ నుంచి గెలిచారు. తాజాగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కు మారారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్‌కు మంచి క్యాడర్ ఉన్నందున ఆయన అయితేనే బండి సంజయ్‌ను ఎదుర్కొంటారని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమలంలో సర్దుబాటు కాలేక ఇబ్బంది పడుతున్న ఈటల రాజేందర్ మరి కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేదా అనేది చూడాలి.