Kolikapudi Srinivasa Rao: అనసూయ ఆడకూతురే.. మరి షర్మిల మాటేంటి?

రాజకీయంగా ఈ వివాదం ఇలానే ఉండగా మరోవైపు సినిమాల రగడ నడుస్తోంది. సీఎం జగన్ రాజకీయ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్ వర్మ వ్యూహం, శపధం అన్న చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : February 17, 2024 3:28 pm
Follow us on

Kolikapudi Srinivasa Rao: వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టాక వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. సోదరుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ పరిణామంతో వైసీపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. జగన్ విషయంలో షర్మిల తీరును ఎక్కువమంది తప్పు పడుతున్నారు. మరికొందరు జగన్ వీరాభిమానులైతే షర్మిలను టార్గెట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం పై సైతం కామెంట్లు నడుస్తున్నాయి. దీనిపై వైఎస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రాజకీయంగా ఈ వివాదం ఇలానే ఉండగా మరోవైపు సినిమాల రగడ నడుస్తోంది. సీఎం జగన్ రాజకీయ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్ వర్మ వ్యూహం, శపధం అన్న చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో ఫస్ట్ పార్ట్ వ్యూహం చిత్రంవిడుదలకు సిద్ధమయింది.కానీ చంద్రబాబు, పవన్ ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాంగోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా సినిమాను తీశారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు. అటు కోర్టు ఆదేశాల మేరకు.. సెన్సార్ బోర్డు ప్రత్యేకంగా పరిశీలించి.. నివేదికలు ఇచ్చిన మేరకు ఆ సినిమాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాజధాని ఫైల్స్ సినిమాకు సైతం అడ్డంకులు ఏర్పడ్డాయి. అమరావతి రాజధాని రైతులనిరసనలు, పోరాటాలను ప్రతిబింబిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా సైతం సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని కొందరు వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో చిత్ర ప్రదర్శనను ఉన్నపలంగా నిలిపివేశారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను పరిశీలించిన కోర్ట్ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

అయితే ఈ సినిమాల వ్యవహారంలో షర్మిల పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఆమె సోదరుడు జగన్ తో రాజకీయంగా విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అటు తల్లి విజయమ్మ సైతం షర్మిల వైపే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తల్లి, చెల్లిని జగన్ అన్యాయం చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. సినిమాల విషయంలో జరుగుతున్న రగడపై ఓ టీవీ ప్రత్యేక చర్చ గోష్టి నిర్వహించింది. ఈ సందర్భంగా కొలికపూడి యాత్ర 1 లో ఒక ఘటనను తెరపైకి తెచ్చారు. వైఎస్ కుటుంబానికి వ్యతిరేక కుటుంబంగా ముద్రపడిన పాణ్యం సరితా రెడ్డి పాత్రలో ఉన్న అనసూయ.. రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థిస్తారు. అప్పుడు అనుచరులు తప్పు పడతారు. ఆడబిడ్డతో రాజకీయం ఏమిటి? అని వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఉన్న మమ్ముట్టి చెప్పుకొస్తారు. ఇప్పుడు అదే దృశ్యాన్ని కొలికపూడి గుర్తుకు తెచ్చారు. మీ ఇంటి ఆడకూతురు పరిస్థితి ఏమిటని షర్మిల గురించి ఆయన ప్రస్తావించారు. షర్మిల వ్యక్తిగత జీవితం గురించి, ఆమె వైవాహిక జీవితం గురించి వైసీపీ శ్రేణులు ఘోరంగా మాట్లాడుతున్నాయని.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయని శ్రీనివాసరావు తప్పుపట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.