Engineer Vijaya Reddy Case: ఏ కాకి కూడా ఏకాకి కాదు అంటారు. దీనిని బట్టి ఒంటరిగా ఉండడాన్ని చివరికి పక్షులు కూడా తట్టుకోలేవు. అందువల్లే అవి గుంపులుగా వెళ్తాయి. సమూహం లాగా బతుకుతుంటాయి. పక్షులతో పోల్చి చూస్తే ఎంతో తెలివైన మనుషులు మాత్రం ఇప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. కొందరు అందులో ఆనందాన్ని వెతుక్కుంటుంటే.. మరికొందరేమో ఆ ఒత్తిడి తట్టుకోలేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ నగరంలో చర్లపల్లి, ఘట్ కేసర్ ప్రాంతాల మధ్య విజయ రెడ్డి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె చేతన, కుమారుడు విశాల్ తో ఆమె ఆత్మహత్య చేసుకుంది. విజయ రెడ్డి తన కుమార్తె, కుమారుడితో కలిసి అలా చనిపోడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. గూడ్స్ రైలు కింద పడి అలా చనిపోవడం అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
పోలీసులు విజయరెడ్డి ఫోన్, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమందిని పోలీసులు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకొచ్చారు. విజయ రెడ్డి ఒంటరితనం వల్లే ఇంతటి దారుణానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన కంటే ముందు విజయ రెడ్డి కారులో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమె పిల్లలు కూడా ఉన్నారు. జీవితం.. ఎదురయ్యే సవాళ్లు.. ఒంటరితనం వంటి వాటిని పిల్లలకు విజయ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. అందువల్లే వారు కూడా తల్లితో పాటు వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత విజయ రెడ్డి, ఆమె పిల్లలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిపారు.
సురేందర్ రెడ్డి కి విజయకు 2007లో పెళ్లి జరిగింది. సురేందర్ కు 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం రావడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. విజయ రెడ్డి తన పిల్లలతో కలిసి ఉప్పల్ డిపోలో రాఘవేంద్ర నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. విజయ రెడ్డి తో పాటు ఆమె తల్లి కూడా ఉంటున్నారు. విజయరెడ్డి ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఆమె విధులు కూడా రాత్రిపూట ఉంటాయి. అందువల్లే పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే పిల్లల భవిష్యత్ కోసం విజయ రెడ్డి, సురేందర్ రెడ్డి ఉద్యోగాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్ లో ఉన్నారు. నాలుగేళ్లు ఆయన అక్కడే ఉండడంతో విజయ రెడ్డి లో ఒంటరితనం అనే భావన వ్యాపించింది. దీనికి తోడు గడచిన 15 రోజులుగా ఆమె ఒంటరితనంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారితో ఇదే విషయం చెప్పి బాధపడేది.
తన ఆత్మహత్య లేఖను వాట్సాప్ స్టేటస్ గా విజయ రెడ్డి పెట్టింది. దీనిని బట్టి ఆమె ఎంత వేదనకు గురిందో అర్థం చేసుకోవచ్చు. హాస్టల్ నుంచి తన పిల్లల్ని తీసుకొచ్చిన విజయ రెడ్డి.. తన కారును చర్లపల్లి రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ప్లేస్ లో నిలిపింది. పార్కింగ్ నిర్వాహకులు ఇచ్చే చీటీ మీద.. తనకు బతికే ఉద్దేశం ఏమాత్రం లేదని.. తన చనిపోతే పిల్లలు కూడా ఒంటరి అవుతారని భావించి.. ఈ నిర్ణయం తీసుకుంటున్నానని రాసింది. ఆ చీటీని కారులోనే ఉంచింది. దానిని ఫోటో తీసి వాట్సప్ స్టేటస్ గా పెట్టింది.
విజయ రెడ్డి ఐటి ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె బృందంలో 15 మంది ఉన్నారు. చివరగా ఆమె ఇద్దరు ఐటీ నిపుణులతో చాటింగ్ చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఇందులో ఒక వ్యక్తి ఐ యాం సారీ మేడం అని మెసేజ్ పెట్టారు. దానిని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఐటీ ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పుడు ఇటువంటి తప్పులు సర్వ సాధారణమని.. అందువల్లే ఆమెకు అటువంటి సందేశాలు నిత్యం పంపుతూ ఉంటామని ఉద్యోగులు చెప్పారు. మరోవైపు విజయ రెడ్డి కుటుంబంలో ఏవైనా ఆస్తి తగాదాలు.. ఇతర ఇబ్బందులు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.