ENC Bhookya Hari Ram Illegal Assets: కాళేశ్వరం ఎన్ని ఎకరాలకు నీరు అందించిందో తెలియదు గాని.. అందులో పని చేసిన అధికారులకు మాత్రం కనక వర్షం కురిపించింది. కనివిని ఎరగని స్థాయిలో సంపాదన అందించింది. గత ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం వ్యవహారాన్ని లోతుగా తవ్వడంతో అసలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. కాళేశ్వరం లో ఇప్పటికే అక్రమాలు జరిగాయని.. ఆర్థికంగా తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది.. ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి హరి రామ్ నాయక్ భారీగా ఆస్తులను కూడా పెట్టారని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఏసీబీ రంగంలోకి దిగి కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు హరి రామ్ నాయక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండిగా హరి రామ్ నాయక్ కొనసాగారు. ఈయన అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత దగ్గర వ్యక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హరి రామ్ నాయక్ ఆస్తుల విషయాన్ని ఏసీబీ తవ్వితీసింది. ఇందులో భాగంగానే హరి రామ్ నాయక్ సంపాదించిన ఆస్తుల వివరాలను బయటపెట్టింది. ఏసీబీ అధికారులు బయటపెట్టిన వీరుల ప్రకారం హరి రామ్ నాయక్ కు మర్కుక్ ప్రాంతంలో 28 ఎకరాలు, బొమ్మల రామారంలో 6 ఎకరాలు, పటాన్చెరు ప్రాంతంలో 20 గుంటలు, షేక్ పేట, కొండాపూర్ లో విల్లాలు ఉన్నాయి. మాదాపూర్, శ్రీనగర్ కాలనీ నర్సింగ్ లో రెండు ఇండ్లు, ప్లాట్లు ఉన్నాయి. కుత్బుల్లాపూర్, మిర్యాలగూడ లో ప్లాట్లు ఉన్నాయి. అమరావతిలో స్థలాలు, కొత్తగూడెంలో భారీ భవనం కూడా ఉంది. వీటన్నింటినీ ప్రభుత్వం జప్తు చేయనుంది.
కాళేశ్వరం లో హరి రామ్ నాయక్ అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. మురళీధర్ రావు కూడా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గా కొనసాగారు. నాడు ప్రభుత్వ పెద్దలకు హరిరామ్ నాయక్ అత్యంత దగ్గర వ్యక్తిగా పేరుపొందారు. నిర్మాణ సంస్థలకు మేళ్లు చేకూర్చారని అభియోగాలు ఎదుర్కొన్నారు. తద్వారా భారీగా వెనకేసుకున్నారు అని తెలుస్తోంది. అందువల్లే ఈ స్థాయిలో ఆస్తుల సంపాదించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఎసిబి అధికారుల అదుపులో ఉన్నారు. ఈ వ్యవహారంలో కీలక నిజాలను బయటపెట్టారని.. ప్రభుత్వం అందువల్లే వేగంగా విచారణ చేపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.