Artisan Strike: తమది ఎంప్లాయ్ ఫ్ల్రెండీ గవర్నమెంట్ అని సీఎం కేసీఆర్, మంత్రులు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులకు కడుపులో పెట్టుకుని చూసుకుంటామంటారు సీఎం. అయితే ఇదంతా గతం. తన మాట విననివారిపై ఉక్కుపాదం మోపుతారు కేసీఆర్. మూడేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెతో ఇది బహిర్గతమైంది. మొన్న వీఆర్‌ఏల విషయంలోనూ అదే పరిస్థితి. అంటే ‘నేను చెప్పిందే వినాలి.. లేదంటే అనుభవిస్తారు’ అన్నట్లు వ్యవహిస్తారు సీఎం. దీంతో ఉద్యోగులు ఉద్యమాలనే మర్చిపోయారు. జీతాలు సరిగా ఇవ్వకున్నా.. డీఏ పెండింగ్‌లో ఉన్నా.. అక్రమంగా బదిలీలు చేసినా నోరు మెదపడం లేదు. ఇక ఉద్యోగ సంఘాల నేతలు అయితే కేసీఆర్ భజనలో తరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో విద్యుత్ ఆర్టిజన్లు సమ్మెబాట పట్టారు. సమ్మె చేస్తే ఉద్యోగం ఊడుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. అయినా.. సమ్మెకే సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.
ఉద్యోగుల్లో ఉత్కంఠ..
తెలంగాణలో ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వగా. ఒకవేళ సమ్మెకు దిగితే ఉద్యోగాలు పోతాయ్ అంటూ ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం హెచ్చరించినా కూడా ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాము ముందుగా అనుకున్న 25న సమ్మెకు దిగుతామని ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీన్ సర్కార్ వర్సెస్ ఆర్టిజన్ ఉద్యోగులుగా మారింది. మరి నేడు ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
డిమాండ్లు ఇవీ..
ఆర్టిజన్ ఉద్యోగులు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. వాటిని వెంటనే పరిష్కరించాలని.. స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు ఎక్సిస్టింగ్ సర్వీస్ రూల్ అమలు చేయాలని .. కార్మికుల విద్యార్హతను బట్టి కన్వెర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. వీటితోపాటు 50 శాతం పీఆర్సీ అమలు చేయాలని కొత్తగా చేరిన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఆ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందా? లేక ముందుగా చెప్పినట్టు ఏమైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందా? అనేది చూడాలి.
భయపడని ఆర్టిజన్లు..
సమ్మె చేస్తే ఉద్యోగాలు ఊడతాయని ప్రభుత్వం హెచ్చరించినా ఆర్టిజన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేనికైనా రెడీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంప్పుడు అన్నట్లుగా సమ్మెకే సై అంటున్నారు. ఇన్నేళ్లుగా సమస్యల పరిష్కారానికి ఎదురు చూశామని, ప్రభుత్వం పరిష్కరించకపోగా, ఉద్యోగులను విడగొట్టాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు మంచివి కాదంటున్నారు. అత్యవసర విభాగం కిందకు వచ్చే విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగం తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.