Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ లో తెలుగు కంపెనీలేం తక్కువ కాదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన జాబితా ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ సంస్థ 1,368 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించింది. అత్యధిక చెల్లింపులు చేసిన కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 15, 2024 2:43 pm

Electoral Bonds

Follow us on

Electoral Bonds: రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సుప్రీంకోర్టు వరుసగా చురకలు అంటించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు జాబితాలలో వివరాలు అందించింది. అయితే ఈ జాబితాలలో కంపెనీలు ఎంత విలువైన బాండ్స్ కొన్నవి, రాజకీయ పార్టీలకు అందిన విలువైన బాండ్స్ కు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ వివరాలలో బాండ్లకు సంబంధించిన సీరియల్ నెంబర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తావించలేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పనంతవరకు కంపెనీలు కొనుగోలు చేసిన బాండ్లు ఏ పార్టీకి అందాయో తెలుసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలి ఉన్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

తక్కువేం కాదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన జాబితా ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ సంస్థ 1,368 కోట్లను బాండ్ల రూపంలో చెల్లించింది. అత్యధిక చెల్లింపులు చేసిన కంపెనీగా ఇది మొదటి స్థానంలో ఉంది. తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా కంపెనీ 966 కోట్లు చెల్లించింది. ఈ సంస్థ గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నిర్మాణ పనులు చేపట్టేది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించింది. భాగస్వామ్య కంపెనీలతో కలిపి సింగపూర్, ఇతర దేశాల్లోనూ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ 966 కోట్లు ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఆసుపత్రి సేవలు నిర్వహిస్తున్న యశోద హాస్పిటల్స్ ఏకంగా 162 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రి హైదరాబాదులో ఐదు, ఉత్తర భారత దేశంలో చైన్ ఆస్పత్రులు నిర్వహిస్తోంది. వైద్యరంగంలో యశోద కంటే పేరుపొందిన పెద్ద ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. యశోద యాజమాన్యం 162 కోట్లు చెల్లించడం విశేషం. యశోద తర్వాత పేరుపొందిన ఫార్మా కంపెనీ అయిన రెడ్డి ల్యాబ్స్ 80 కోట్ల వరకు చెల్లించింది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. బల్క్ డ్రగ్స్ తయారీలో ఈ కంపెనీ కీలకపాత్ర పోషిస్తున్నది.

ఇక నిర్మాణ రంగంలో పేరుపొందిన నవయుగ కంపెనీ కూడా 55 కోట్లను బాండ్ల కోసం ఖర్చు చేసింది. ఈ కంపెనీ చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేకపోయినప్పటికీ.. 55 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు గతంలో చేపట్టింది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి పనులు బదిలీ అయ్యాయి. ఇక ఏపీలోనే కడప కేంద్రంగా నిర్మాణ పనులు చేపట్టే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ 40 కోట్లు బాండ్స్ కోసం ఖర్చు చేసింది. ఈ కంపెనీ ప్రస్తుతం కడప, చిత్తూరు, కోస్తా ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు చేపడుతోంది. వాస్తవానికి ఈ కంపెనీ ఏర్పడి కొన్ని సంవత్సరాలే అయినప్పటికీ ఏకంగా 40 కోట్లు వెచ్చించడం విశేషం. అయితే ఈ కంపెనీ ఏపీలోని అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడికి చెందిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఓ హత్య కేసు కు సంబంధించి ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే ఆయన ఆధ్వర్యంలోని ఈ కంపెనీ బాండ్లు కొనుగోలు చేసిందో.. అప్పుడే ఆయనపై కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా కంపెనీల ద్వారా డబ్బులు అందిన రాజకీయ పార్టీలలో తెలుగు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితి టాప్ లో ఉంది. ఈ పార్టీకి ఏకంగా 1,215 కోట్లు అందాయి. ప్రాంతీయ పార్టీల విభాగంలో భారత రాష్ట్ర సమితి రెండవ స్థానంలో ఉంది. భారత రాష్ట్ర సమితి తర్వాత వైసీపీకి 337 కోట్లు, టిడిపికి 219 కోట్లు, జనసేనకు 21 కోట్లను బాండ్స్ రూపంలో కంపెనీలు నగదు ఇచ్చాయి.