Bihar Elections: బీహార్ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో అన్ని రాజకీయ పార్టీలలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు జోరుగా పాల్గొంటున్నాయి. త్వరలో రెండవ విడత ఎన్నికలు అక్కడ జరగబోతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు విడుదలవుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉపాధి నిమిత్తం పనులు చేస్తున్న బీహార్ ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బీహార్ ప్రజలు ఉత్సాహాన్ని ప్రదర్శించడం ఆనందాన్ని కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో సొంత ప్రాంతాలకు వచ్చారని బీహార్ ఎన్నికల అధికారులు అంటున్నారు.
బీహార్ ఎన్నికలు అక్కడి రాజకీయ పార్టీలకు ఒక రకమైన పరీక్షను పెడుతుంటే.. తెలంగాణ రైతులకు మరో విధమైన ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాస్తవానికి బీహార్ ఎన్నికలకు.. తెలంగాణ రైతులకు ఎటువంటి సంబంధం లేదు. అయితే బీహార్ ఎన్నికల వల్ల తెలంగాణ రైతులు ఇబ్బంది పడడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంట కోతకు వచ్చింది. చాలా ప్రాంతాలలో రైతులు వరి కోశారు.. ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని తూకం వేయడానికి కూలీలు అవసరం పడుతుంది. తెలంగాణలో ధాన్యం తూకం వేసే పనికి హమాలీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందువల్లే కొంతకాలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీలుగా బీహార్ కూలీలు పనిచేస్తున్నారు. పైగా బీహార్ ప్రజలకు కష్టపడి పనిచేసే తత్వం అధికంగా ఉంటుంది. వారు ఎంతటి ఎండనైనా సరే తట్టుకుంటారు. అందువల్లే బీహార్ కూలీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తుంటారు. అయితే ప్రస్తుతం శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీహార్ ప్రాంతానికి చెందిన హమాలీలు మొత్తం సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు.
అధికారుల అంచనా ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన దాదాపు 18,000 మంది హమాలీలు దాన్యం కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం మిల్లుల వద్ద పనిచేస్తుంటారు. ఓటు వేయడానికి వారు వెళ్లిపోవడంతో ధాన్యం లోడింగ్ అనేది సక్రమంగా సాగడం లేదు. దీంతో మిల్లుల వద్ద ధాన్యం నిలువలు పేరుకు పోతున్నాయి. దీనికి తోడు బీహార్ హమాలీలను అక్కడి రాజకీయ పార్టీలు ఓటుకు 5000 చొప్పున ఇచ్చి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత హమాలీలు ఇక్కడికి వస్తేనే ధాన్యం కొనుగోలు.. అన్లోడింగ్ వేగంగా సాగుతుందని మిల్లర్లు చెబుతున్నారు.