Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు శుక్రవారం ఉదయమే సోదాలు మొదలుపెట్టారు. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా 16 బృందాల అధికారులు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య అధికారులు హైదరాబాద్ నగరానికి వచ్చారు. భారీ బందోబస్తు మధ్య పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారు. ఏడాది నవంబర్ మూడున నగరంలోని పొంగులేటి నివాసం, హైదరాబాదులోని నందగిరి హిల్స్ లోని ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -10 లోని రాఘవ ప్రైడ్ లోనూ తనిఖీలు చేపట్టారు. అయితే అప్పుడు పొంగులేటి ఇంట్లో ఏం స్వాధీనం చేసుకున్నారు? ఏం లభ్యమయ్యాయి? అనే విషయాలను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బయటకు వెల్లడించలేదు.. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరును పొంగులేటి తప్పు పట్టారు. తాను భారతీయ జనతా పార్టీలోకి వెళ్లలేదు కాబట్టే.. ఇలా టార్గెట్ చేశారని పొంగులేటి ఆరోపించారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో దాడులు చేయించారని ఆరోపించారు.. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి ఎన్నికల్లో పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి పై 50వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ, సమాచార పౌర సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారం కోసం పొంగులేటి కృషి చేస్తున్నారు. ధరణి స్థానంలో భూ మాత పోర్టల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ధరణిలో అనేక మా డ్యూల్స్ ను సవరించారు.
రెండు నెలల క్రితం
సరిగ్గా రెండు నెలల క్రితం పొంగులేటి కుమారుడు హర్ష విదేశాల నుంచి విలువైన చేతి గడియారాలను దొంగ చాటుగా దిగుమతి చేసుకున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం అందింది. చెన్నైలోని కస్టమ్స్ అధికారుల తనిఖీలు ఈ విషయం తెలిసింది. దీంతో వారు హర్షను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని హర్ష చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు హర్షను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు. అయితే హర్ష సింగపూర్ ప్రాంతం నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి చెన్నై నగరానికి చెందిన ఓ వ్యక్తి సహకరించాడని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అప్పట్లో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై నగరానికి చెందిన ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. దీన్ని మర్చిపోకముందే పొంగులేటి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహించడం విశేషం. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కేంద్రం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.. అయితే ఈ ఘటనపై ఇంతవరకు పొంగులేటి, ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు.