The Deserving: భారత దేశంలో రాష్ట్రాలను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అభి రుచులు కూడా ఆయా రాష్ట్రాల ప్రేక్షకుల్లో వేర్వేరేగా ఉంటాయి. తమిళ, మళయాలంలో సహజత్వానికి దగ్గరగా సినిమాలు ఉంటాయి. నటీ నటులు కూడా పెద్దగా మేకప్ లేకుండానే నటిస్తారు. ఇక బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు. మన దేశంలో సినిమా తీయడం చాలా కష్టం. కానీ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన ఓ కుర్రాడు హాలీవుడ్‌లోనే తన ప్రతిభతో ఔరా అనిపిస్తున్నాడు. సినిమాలో అన్ని విభాగాలు కీలకమే. హీరోగా, నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామ కాలనీకి చెందిన గుండ వెంకటసాయి కఠోర శ్రమతో అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. ప్రవృత్తిగా నటనగా ముందుకు వెళ్తూ నింరత శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే హాలీవుడ్‌లో సినిమా నిర్మించాడు. ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందాడు.
11 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి..
వెంటకసాయి బీటెక్ తెలంగాణలోనే చదివాడు. ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు. వెంకటసాయికి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ ఎక్కువ. దీంతో తల్లిదండ్రులు గుండ సునీత-శ్రీనివాస్ కొడుకును ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా.. వెంకటసాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా హాలీవుడ్లోనే సినిమా తీసి సత్తా చాటాలనుకున్నాడు. ఖాళీ సమయంలో వెబ్ సిరీస్‌లు, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ పేరుతో పది వెబ్ సిరీస్‌లు తీసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అవార్డులు పొందాడు.
14 రోజుల్లోనే సినిమా తీసి..
తప్పు చేసి పశ్చాతాప పడే అంశం ఇతివృత్తంగా ది డిజర్వింగ్ సినిమాను నిర్మించాడు వెంకటసాయి. చిన్నప్పటి నుంచి వెంకటసాయికి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉంది. దీంతో తన సినిమా కోసం నటీనటుల ఎంపికకు ఆడిషన్స్ నిర్వహించడు. స్టోరీకి తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివిగల సినిమాను కేవలం 14 రోజుల్లోనే తెరకెక్కించాడు. హర్రర్, థ్రిల్లర్, సైకలాజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన సినిమా ది డిజర్వింగ్. సాయికుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోనార్లర్, కేసీస్టారర్, ప్రియ(మోడల్), మారియం సినిమా నిర్మాణానికి సహకరించారని వెంకటసాయి తెలిపారు. అక్టోబర్ 1న ఈ సినిమాను 128 దేశాల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాడు.
ఐదేళ్ల క్రితం కథ..
ది డిజర్వింగ్ సినిమా కథను ఐదేళ్ల క్రితమే రాసుకున్నానని వెంకటసాయి తెలిపాడు. అయితే దానిని తెరకెక్కించడానికి ఇప్పటికి సాధ్యమైందన్నాడు. కథ రాయడం నుంచి సినిమా తీయడం వరకు చాలా కష్టపడ్డానని చెప్పాడు. టాలీవుడ్ సినిమాలాగా హాలీవుడ్‌లో టేక్‌లు ఉండవని తెలిపాడు. డబ్బింగ్ కూడా ఉండదన్నాడు. ఇంగ్లిష్ వారికి నచ్చేలా మన కథలో కొంత మార్పు చేసి సినిమా తీశానని తెలిపాడు.