https://oktelugu.com/

Nizam Ruling : నిజాం ఎలా పాలించారు..? అప్పుడు సౌకర్యాలు ఎలా ఉండేవి?

భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాజధాని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ, తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. అయితే దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు హైదరాబాద్ సంస్థానానికి హైదరాబాద్ రాజధానిగా కూడా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 26, 2024 / 04:19 PM IST

    Nizam Rule

    Follow us on

    Nizam Ruling :  నిజాంలు హైదరాబాద్‌ను రెండు శతాబ్దాలపాటు పాలించారు. భారతదేశంలోని అనేక చారిత్రక ఘటనలలో కీలక పాత్ర పోషించారు. 1724 నుండి 1948 వరకు హైదరాబాద్‌లో వీరి జైత్రయాత్ర కొనసాగిందని చెప్పాలి. భారతదేశంలో అత్యంత నివసించదగిన, సంపన్నమైన నగరాలలో హైదరాబాద్ ఒకటి. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాజధాని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ, తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. అయితే దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు హైదరాబాద్ సంస్థానానికి హైదరాబాద్ రాజధానిగా కూడా ఉంది.

    ఒక్కో రాజు ఒక్కో తీరుగా హైదరాబాద్‌ను పాలించారు. వారిలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌లు మాత్రం నీటి పారుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అందులోనూ ఏడో రాజు ఎంతో టాలెంట్ ఉన్న నవాబు అలీ నవాజ్ జంగ్‌ను రాజ్య ప్రధాన ఇంజినీర్‌గా నియమించాడు. దాంతో ఆయన హయాంలో నీటి పారుదల చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అప్పటికే ఉన్న చెరువులతోపాటు కాలువులను, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించడంనతోపాటు కొత్త వాటినీ నిర్మించారు.

    1810లో పాలించిన మూడో నిజాం రాజు సికిందర్ జా ప్రధానమంత్రి మీర్ అలం హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం ట్యాంక్‌ను నిర్మించాడు. ఈ ట్యాంకు ప్రస్తుతం నెహ్రూ జూపార్క్ కోసం నీటిని సరఫరా చేస్తోంది. అలాగే.. 1905లో మెదక్ జిల్లా ఘన్‌పూర్ దగ్గరలో మంజీరా నదిపై ఘన్‌పూర్ ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 21,625 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అదే సంవత్సరంలో నల్లగొండ జిల్లా నెమలికాల్వ గ్రామంలో మూసీ నదిపై అసఫ్‌నహర్ అనే ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15,245 ఎకరాలకు సాగు నీరు అందుతోంది.

    1927 సంవత్సరంలో ఉస్మాన్‌సాగర్, గండిపేట, హిమాయత్‌సాగర్‌లను ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించాడు. 1908లో మూసీ నదికి భారీగా వరదలు రావడగంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆ నీటిని హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి ఉపయోగపడాలని అనుకున్నారు. దాంతో నగరానికి 20కిలోమీటర్ల ఎగువన మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ నిర్మించాడు. మూసీ ఉప నది అయిన ఈసా నదిపై తన పెద్ద కుమారుడైన హిమాయత్ అలీఖాన్ పేరిట 1927లో హిమాయత్ సాగర్ ను సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులే హైదరాబాద్ మహానగరం ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి.

    ఇక 1924-29 మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకాలో బెలాల్ ప్రాజెక్టును నిర్మించారు. రూ.1,28,000 వ్యయంతో దీనిని కట్టారు. 1,265 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా దీనిని కట్టారు. అదే జిల్లాలోని పోచారం గ్రామంలో 1922లో ఆలేరు ఉపనదిపై రూ.34 లక్షలతో 13,00 ఎకరాలకు ఆయకట్టు లక్ష్యంగా పోచారం రిజర్వాయర్ నిర్మించారు. 1924లో మెదక్ జిల్లాలోని రాయంపల్లిలో రూ.3 లక్షల వ్యయంతో 1924లో రాయంపల్లి రిజర్వాయర్ కట్టారు.

    ఇక నందికొండ-నాగార్జునసాగర్ ప్రాజెక్టును ముందుగా కృష్ణా నదిపై నందికొండ (నల్లగొండ)లో నిర్మించాలని అనుకున్నారు. ఇందుకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ప్రముఖ ఇంజినీర్ జాఫర్ అలీతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కువ నీరు తెలంగాణకే వచ్చేలా ప్రయత్నాలు సాగాయి. కానీ.. ఆ తదుపరి కేఎల్ రావు ఆధ్వర్యంలో నందికొండ ప్రాజెక్టును దిగువకు తీసుకెళ్లి రెండొంతుల నీళ్లు ఆంధ్రకు వెళ్లేలా చేశాడు. ఇంకా నిజాం హయాంలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు, వైరా ప్రాజెక్టు, సింగభూపాలం రిజర్వాయర్, మానేరు రిజర్వాయర్, డిండి ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయి.

    ఇండియాలో స్థానిక సంస్థలను కూడా బ్రిటీష్ హయాంలోనే ప్రవేశపెట్టారు. 1884లో లార్డ్ రిప్పన్ అమలు చేయగా.. ఆ ప్రభావం నిజాం రాజ్యంపై పడడంతో నిజాం రాజు 1888లో దస్తూర్ ఉల్ అమల్ చట్టాన్ని జారీ చేశారు. ఇది 1889లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం సెంట్రల్ బోర్డు, జిల్లా బోర్డు, తాలూకా బోర్డులు అమల్లోకి వచ్చాయి. అరవమూడి అయ్యాంగార్ కమిటీ సూచన మేరకు 1000 నుంచి 5000 జనాభా కలిగిన గ్రామాల్లో 1942 చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పంచాయతీ సభ్యులు, సర్పంచును నామినేటెడ్ పద్ధతిలో తహసీల్దార్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం తాలూకాదార్ లేదా జిల్లా అధికారి నామినేట్ చేస్తాడు. కాగా.. వీరి పదవి కాలం అప్పుడు మూడేళ్లే.

    ఇక వైద్య సదుపాయాల విషయానికి వచ్చేసరికి 1846లో హైదరాబాద్‌లో ఉస్మానియా మెడికల్ హైస్కూల్‌ను నిర్మించారు. 1927లో అది మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయింది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను 1908లో అమీర్‌పేటలోని విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. జనరల్ హాస్పిటల్‌ను 1938లో అఫ్జల్‌గంజ్‌లో ఏడో నిజాం నిర్మించాడు. దీనిని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌గా మార్చారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద హాస్పిటల్ కూడా. ఏడో నిజాం కోడలు ప్రిన్స్ నిలోఫర్ జ్ఞాపకార్థం నిలోఫర్ హాస్పిటల్ నిర్మించారు. నిమ్స్ కూడా మొదట్లో నిజాం నవాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగింది. హాస్పిటల్ ఉన్న భూభాగమంతా కూడా నిజాం నవాబుదే.