Hyderabad Real Estate: ఇక హైదరాబాదులో ఇళ్లు కొనడం కష్టమే.. ఎందుకంటే?

బెంగళూరు అనంతరం ఢిల్లీలోని ఎన్ సీ ఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 16 శాతం పెరిగాయి. ధరలపరంగా ఇది రెండవ స్థానంలో ఉంది. ద్వారక ఎక్స్ ప్రెస్ వే పరిధిలో ఇళ్ళ ధరలు 23% పెరిగాయి. హైదరాబాదులో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇళ్ల ధరలు సగటున తొమ్మిది శాతం పెరిగాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 17, 2024 4:37 pm

Hyderabad Real Estate

Follow us on

Hyderabad Real Estate: హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి చిరునామాగా మారింది. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వెలుగు వెలిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని.. ఇళ్లకు గిరాకీ ఉండదని రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ ఊహాజనితాలని తేలిపోయింది. ఎందుకంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇళ్లకు, ప్లాట్లకు, ఫ్లాట్లకు ధరలు పెరగడం.. హైదరాబాద్ కు ఉన్న డిమాండ్ ను తెలియజేస్తోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో సగటున ఇళ్ల ధరలు 19 శాతం పెరగగా.. అదే దారిలో హైదరాబాద్ పయనిస్తోంది. దేశంలోని టాప్ – 8 నగరాలలో ఇళ్ల ధరలు అధికంగా పెరగగా.. అందులో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ కూడా టాప్ -8 జాబితాలో కొనసాగుతోంది.. పెరిగిన ధరలకు సంబంధించి క్రెడాయ్ అండ్ కొరియర్స్ లియాసెస్ ఫొరాస్ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం హైదరాబాదులో ఇళ్ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

మనదేశంలో ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో టాప్ 8 నగరాలలో సగటున 10% ఇళ్ల ధరలు పెరిగాయి.. రెసిడెన్షియల్ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సానుకూల దృక్పథం కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.. బెంగళూరు నగరంలో ఈ ఏడాది ఇళ్ల ధరలు, గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయి. ఇళ్ల ధరల పరంగా దేశం మొత్తం మీద ఈ 8 నగరాలలోనే అధికంగా ఉండడం విశేషం. బెంగళూరులోని ఫెరిఫెరీ అండ్ ఔటర్ ఈస్ట్ మైక్రో మార్కెట్ లో ఇళ్ల ధరలు 32 శాతం పెరిగాయి. దీని తర్వాత ఫెరిఫెరీ అండ్ అవుటర్ నార్త్ మార్కెట్లో సగటున 18% ధరలు పెరిగాయి. ఇక వైట్ ఫీల్డ్, కె ఆర్ పురం వంటి ప్రాంతాలలో త్రిబుల్ బెడ్ రూమ్, క్వాడ్రా ఫుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది..

బెంగళూరు అనంతరం ఢిల్లీలోని ఎన్ సీ ఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 16 శాతం పెరిగాయి. ధరలపరంగా ఇది రెండవ స్థానంలో ఉంది. ద్వారక ఎక్స్ ప్రెస్ వే పరిధిలో ఇళ్ళ ధరలు 23% పెరిగాయి. హైదరాబాదులో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇళ్ల ధరలు సగటున తొమ్మిది శాతం పెరిగాయి. ఇక గత ఎడాది అక్టోబర్ డిసెంబర్ సమయంలో పోలిస్తే ఇప్పుడు రెండు శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. ఇక గత త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత త్రైమాసికంలో ధరలు పెరిగిన జాబితాలో అహ్మదాబాద్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ ఏడు శాతం మేర ధరలు పెరిగాయి..కోల్ కతా లో ఇళ్ల ధరలు రెండు శాతం తగ్గాయి. చెన్నైలో ఎటువంటి మార్పులు లేవు. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే ఇళ్ల ధరలు చెన్నైలో నాలుగు శాతం పెరిగాయి.

విద్య, ఉద్యోగం, కెరియర్ ఈ మూడు అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో చాలామంది నగరాలలో జీవించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా నగరంలో భూమి మీద పెట్టుబడి పెడితే అనేక రెట్ల లాభాలు కళ్ళ చూసే అవకాశం ఉండడంతో చాలామంది ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బ్యాంకులు కూడా రుణాల మంజూరు ను సులభతరం చేయడంతో గృహాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి.