Food Orders : వామ్మో.. అన్ని బిర్యానీలా? రంజాన్ నాడు హైదరాబాదీయులు ఎన్ని ఆర్డర్లు ఇచ్చారో తెలుసా?

బిర్యానీ టాప్ ప్లేస్ లో ఉండటంతో.. హైదరాబాద్ వాసులు మరోసారి బిర్యానిపై తన ప్రేమను చాటుకున్నారని స్విగ్గి ప్రకటించింది. అయితే హైదరాబాద్ వాసులకు బిర్యానీ అనేది సాధారణ విషయమని.. బిర్యానీ అంటేనే హైదరాబాద్.. హైదరాబాద్ అంటేనే బిర్యానీ అని స్విగ్గీ వివరించింది..

Written By: NARESH, Updated On : April 12, 2024 9:51 pm

Do you know how many food orders Hyderabadis place during Ramzan?

Follow us on

Food Orders : బిర్యానీ.. ఈ మూడు అక్షరాల పదం దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు ఏమో తెలియదు కానీ.. హైదరాబాదీయులకు మాత్రం ప్రాణం. బిర్యానీ అనే పేరు వినిపిస్తే చాలు.. కిలోమీటర్ల దూరమైనా ప్రయాణిస్తారు. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్, వెజ్.. ఎన్ని రకాలైనా సరే ఆవురుమంటూ ఆరగిస్తారు. మామూలు రోజుల్లోనే హైదరాబాదీయులు బిర్యానీ లొట్టలు వేసుకుంటూ తింటారు… ఇక రంజాన్ సందర్భంగా వేరే చెప్పాలా.. కానీ ఈసారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా రంజాన్ నాడు హైదరాబాద్ వాసులు సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా లక్షల కొద్దీ బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చి సరి కొత్త రికార్డు సృష్టించారు.. ఆర్డర్లే లక్షల్లో ఉంటే.. ఇంకా నేరుగా హోటళ్లకు వెళ్లి తిన్నవాళ్ళు ఎంతమంది ఉంటారో..

మామూలు రోజుల్లోనే హైదరాబాదులోని బావర్చి నుంచి మొదలుపెడితే పిస్తా హౌస్ వరకు ఫుల్ రష్ ఉంటుంది. ఇక రంజాన్ సందర్భంగా అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా పెద్ద పెద్ద హోటళ్లు రంజాన్ పండుగను పురస్కరించుకొని కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాయి. ఇంకేముంది భోజన ప్రియులు హోటళ్లకు క్యూ కట్టారు. హోటల్స్ దాకా వెళ్లలేని వారు ఆన్ లైన్ లో ఆర్డర్లు పెట్టుకున్నారు. ఆన్ లైన్ లో అర్ధరాత్రి దాకా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. హైదరాబాద్ వాసులు మరో మాటకు తావు లేకుండా నచ్చిన బిర్యాని లను ఆర్డర్ చేసుకొని లొట్టలు వేసుకుంటూ తిన్నారు. బిర్యానీ మాత్రమే కాదు హలీం ఆర్డర్స్ లోనూ సరికొత్త రికార్డు సృష్టించారట. కేవలం రంజాన్ మాసం లో 5.3లక్షల హలీం ఆర్డర్లు ఇచ్చారని ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి ప్రకటించింది. రంజాన్ మరుసటి రోజు ఆ వివరాలను స్విగ్గి వెల్లడించింది.

రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కస్టమర్లకు 60 లక్షల ప్లేట్ల బిర్యాని ఆర్డర్స్ డెలివరీ చేసినట్టు స్విగ్గి ప్రకటించింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో 15% ఆర్డర్లు పెరిగాయట. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు నుంచి ఏడు గంటల మధ్య ఇఫ్తార్ విందు ఉంటుంది కనుక.. ఆ సమయంలో 34 శాతం బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని స్విగ్గి వివరించింది. వచ్చిన ఆర్డర్లలో చికెన్ బిర్యాని మొదటి స్థానంలో ఉందని, మటన్ బిర్యానీ రెండవ స్థానంలో, హలీం మూడవ స్థానంలో, ఫలుదా నాలుగవ స్థానంలో, ఖీర్ ఐదో స్థానంలో ఉన్నట్టు స్విగ్గి వివరించింది. బిర్యానీ టాప్ ప్లేస్ లో ఉండటంతో.. హైదరాబాద్ వాసులు మరోసారి బిర్యానిపై తన ప్రేమను చాటుకున్నారని స్విగ్గి ప్రకటించింది. అయితే హైదరాబాద్ వాసులకు బిర్యానీ అనేది సాధారణ విషయమని.. బిర్యానీ అంటేనే హైదరాబాద్.. హైదరాబాద్ అంటేనే బిర్యానీ అని స్విగ్గీ వివరించింది..