Hyderabad : దేశంలో రెండు వర్గాలు ఉంటాయి. అవి సంపన్నులు, పేదోళ్లు. ఎప్పుడూ పేదోళ్లకు ఉన్నోళ్లకు మధ్య తేడాలు ఉంటూనే ఉంటాయి. అధికారులైనా, పాలకులైనా.. డబ్బులు ఉన్నోళ్లకు ఊడిగం చేస్తూ.. పేద వాళ్లను మాత్రం తమకు బానిసలుగా భావిస్తుంటారు. దేశంలో ప్రజలందరూ పన్నులు లెక్కప్రకారం కడితేనే పాలన సజావుగా సాగుతుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. వాటితో రోడ్లు వేయడం, బిల్డింగులను కట్టడం, కరెంట్ సరఫరా ఇతరత్రాలు అన్ని పన్ను డబ్బులతోనే నడుస్తుంటాయి. ప్రభుత్వాలకు ఎక్కువగా రాబడులు పన్నుల ద్వారానే వస్తుంటాయి. అందుకే ప్రభుత్వాలు పన్నులు కట్టాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటాయి. వాస్తవానికి నీతిగా, నిజాయితీగా పన్నులు కట్టేది పేద, మధ్య తరగతి ప్రజలే. వీరు పన్నులు కట్టకుంటే కరెంట్ కట్ చేస్తాం.. తలుపులు తీసుకెళ్తాం అంటూ అధికారులు బెదిరిస్తుంటారు. అయితే రిచ్ పర్సన్స్ కే ఇవన్నీ ఏవీ ఉండవు. వారు రూ.కోట్లు కట్టకపోయినా వారికి సర్వీసులు అందుతూనే ఉంటాయి. ఎప్పుడు అధికారులకు బుద్ధి పుట్టినప్పుడు బకాయిల లిస్ట్ బయడ పెడుతుంటారు. అవి చూస్తే సామాన్యుడు షాక్ తినడం ఖాయం.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. జీహెచ్ఎంసీకి కొంత మంది రూ.కోట్ల పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో కీలక సంస్థలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి రూ.కోట్లకు చేరుకున్నట్లు నిర్ధారించారు. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ఆస్తి పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే సుమారు 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రూ.5లక్షలకు పైగా ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లు. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52కోట్లు అని, ఎల్అండ్టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లు అని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఆస్ బెస్టాస్ కంపెనీ రూ.30 కోట్లు, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ.5.50 కోట్లు, సోమాజిగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని తెలిపారు. వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని… లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.