Telangana Elections 2023: కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని కొన్ని సంస్థలు.. లేదు లేదు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మరికొన్ని సంస్థలు.. కొద్దిరోజుల నుంచి తెలంగాణలో ఎగ్జిట్ పోల్ రాజకీయాలు నడుస్తున్నాయి. సరే మెజారిటీ వర్గాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని చెబుతున్నాయి. అయితే ఇందులో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని కబళిస్తాడు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అధిష్టానం డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది.
నేడు హైదరాబాద్ కు..
కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాలలో డీకే శివకుమార్ తనదైన పాత్ర పోషిస్తున్నారు. వైయస్ షర్మిలను తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం దగ్గర నుంచి టికెట్ల కేటాయింపుదాకా డీకే శివకుమార్ తనదైన పాత్ర పోషించారు. సహజంగా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి.. టికెట్ కేటాయింపుల సమయంలో భారీగా గొడవలు జరగకుండా చూసుకున్నారు. అసంతృప్తులను తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారు. మొత్తానికి ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగారు. అన్నింటికీ మించి అభ్యర్థులకు నిధులు సమకూర్చడంలో తనదైన పాత్ర పోషించారు. నేతల మధ్య ఐక్యత ఉండేందుకు తీవ్ర కృషి చేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రజల్లో ఒక భావన కలిగించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను అత్యంత తెలివిగా కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కూడా కెసిఆర్ పార్టీకి మెరుగైన సీట్లే వస్తాయని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.. పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది. రేపు ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో భారత రాష్ట్ర సమితికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు డీకే శివకుమార్ ద్వారా పలు ప్రణాళికలను అమలులో పెట్టింది.
తాజ్ కృష్ణలో ప్రత్యేక గదులు బుక్
డీకే శివకుమార్ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయన బస చేసే తాజ్ కృష్ణ హోటల్ కి కొంతమంది నాయకులు చేరుకున్నారు. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మెరుగైన సీట్లు సాధిస్తే ఆ రెండో మాటకు తావు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఒక మోస్తరు సీట్లు వస్తే కెసిఆర్ కు అవకాశం ఇవ్వకుండా వారందరినీ తాజ్ కృష్ణ హోటల్లోకి తరలించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ బాధ్యతను డీకే శివకుమార్ నిర్వర్తించనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులను గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వెంట ఉంచారు. తుది ఫలితాలు విడుదలైన తర్వాత, ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ధ్రువపత్రం తీసుకున్న తర్వాత వారిని ఎఐసిసి ప్రతినిధులు నేరుగా తాజ్ కృష్ణ హోటల్ లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత వారిని తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లోని రిసార్ట్లోకి తీసుకెళ్తారు. ఈ రిసార్ట్ లన్ని డీకే శివకుమార్ కు చెందిన బంధువులవి కావడంతో ముందు జాగ్రత్త చర్యగా వాటిని బుక్ చేశారని తెలుస్తోంది. అక్కడ భద్రతాపరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్తారని తెలుస్తోంది.ఒకవేళ సంపూర్ణ మెజారిటీ లభిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి వంటి వారు గాంధీభవన్ లో సమావేశం అవుతారు.. రాజకీయంగా కెసిఆర్ గండర గండడు కాబట్టి ఈసారి ఆయనకు అటువంటి అవకాశం ఇవ్వకుండా పలు విధాలుగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరి రేపు ఫలితం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.