CM Revanth Reddy: అధికారం కాంగ్రెస్‌కు కొత్త కాదు. పాలనలో దశాబ్దాల అనుభవం సొంతం. పార్టీలో నాయకత్వానికి కొదవ లేదు. స్వేచ్ఛ కూడా కాస్త ఎక్కువ. అంతఃకలహాలూ అధికమే. తరచూ ముఖ్యమంత్రులను మార్చే అపవాదు సైతం ఉంది. అయితే దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు పాజిటివ్ దృక్పథంతో డిఫరెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలనపై ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్‌పై ఎదురుదాడి షురూ చేశాయి. హామీల అమలుపై విమర్శలు ఎక్కుపెట్టి సంధిస్తుండగా హస్తం పార్టీ డైవర్ట్ పాలిటిక్స్‌పై దృష్టి సారిచింది.
బీఆర్‌ఎస్ టార్గెట్..
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ ప్రస్తుతం వ్యుహాత్మక మౌనం వహిస్తున్నారు. పార్టీ బాధ్యతలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇందులో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆది నుంచి నిప్పులు చెరిగేలా విమర్శలు చేస్తుండడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో హస్తం పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. తమ పార్టీ ప్రతినిధుల ద్వారా ‘సమంత’ ఎపిసోడ్‌ను తెరపైకి తేవడం, అలాగే పార్ములా-ఈ పై ఏసీబీ కేసు నమోదు వంటి డైవర్ట్ పాలిటిక్స్‌పై దృష్టి సారించింది. మరో కీలకమైన నేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అలాగే ‘కాళేశ్వరం’పై జుడీషియల్ కమిషన్ వంటివి కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది.
సంక్షేమ పథకాలను తెరమీదకు తెస్తూ..
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించిన ప్రతీసారి ప్రభుత్వం ఏదో పథకాన్ని తెరమీదకు తెస్తోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు రేవంత్ సర్కారు ప్రకటించింది. అయితే మిగతా పథకాల అమలులో జాప్యం కావడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే కారణమంటూ ఆ పార్టీని ప్రజల్లో బలహీన పరిచేలా కేబినెట్ ముక్తకంఠంతో పదేపదే పేర్కొంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించింది. నిధుల లేమి సమస్య వెంటాడుతున్నా అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తోంది. తక్కువ నిధులు అవసరమైన రూ.500లకే సిలిండర్, గృహ విద్యుత్ స్కీం అమలుపై తొలుత దృష్టి సారించింది. ఇక రైతులకు సంబంధించి రుణమాఫీకి భారీ మొత్తం అవసరం కావడంతో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామని స్వయంగా సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందకపోవడం గమనార్హం. నిబంధనల కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించకుండా ప్రభుత్వం తరచూ పలు అంశాలను తెరపైకి తెస్తోంది. మూసీ ప్రక్షాళన, హైడ్రా, నిన్నమొన్నటి అల్లు అర్జున్ అరెస్టు.. రాబోయే రోజుల్లో కేటీఆర్ అరెస్టు వంటి అంశాలను ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా పదేపదే ప్రస్తావించడం డైవర్ట్ పాలిటిక్స్‌గా గోచరిస్తోంది.
–