TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టాలకు సమయం ఆసన్నం అయ్యింది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబవుతోంది. ప్రస్తుతం భక్తుల రద్దీ కూడా పెరిగింది. జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ దర్శనాలకు సంబంధించి టోకెన్లు కూడా జారీ చేయనున్నారు. అంతకుముందే కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజులపాటు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల జారీ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం 40 నిమిషాల్లోనే ఆన్లైన్ టికెట్ల బుకింగ్ పూర్తయింది. అటు ఆఫ్ లైన్ టికెట్ల జారీపై కూడా టీటీడీ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.
* 7న ఆలయ సంప్రోక్షణ
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం వేళ జనవరి 7న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7న ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి శాస్త్రోక్తంగా కొనసాగుతుంది. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయంలో లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం.. తదితర సుకుంద ద్రవ్యాలతో కలిపిన పవిత్ర పరిమళ జలంతో ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
* బ్రేక్ దర్శనాలు రద్దు
కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా జనవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో 6వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించరు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 10 నుంచి మూడు రోజులకు సంబంధించి.. జనవరి 9న ఉదయం ఐదు గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని.. తదుపరి రోజులకు సంబంధించి ఏ ఏరోజుకారోజు ముందురోజు టికెట్లు జారీ చేస్తామని ఈవో స్పష్టం చేశారు. తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో నాలుగు కౌంటర్లను కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఉండదని ఈవో స్పష్టం చేశారు.