MLC Kavitha: “భారత రాష్ట్ర సమితి చరిత్రలో మహిళా నాయకులు ఎప్పుడు కూడా ఇంత ఐక్యంగా లేరు. నా మీద సస్పెన్షన్ తర్వాత మహిళా నేతలు అందరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సంతోషం. ఇదే నేను కోరుకుంటున్నది. అధ్యక్షుడికి.. కింది స్థాయి కార్యకర్తకు యాక్సిస్ ఉండాలని భావిస్తున్నాను. ఇప్పటికైనా మహిళా నేతలను గుర్తించారు” ఇవీ బుధవారం నాటి విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు.. నిన్నటి విలేకరుల సమావేశంలో ఒంటరిగానే కవిత మాట్లాడారు. యాదృచ్ఛికంగా ఆమెను ఒంటరి చేసే ప్రయత్నాలను గులాబీ పార్టీ విజయవంతంగా చేపడుతోంది.
Also Read: కల్వకుంట్ల కవిత చెప్పింది అబద్దమా… వైఎస్ ను హరీష్ అందుకే కలిశారా.. వెలుగులోకి సంచలన
గురువారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గతంలో జాగృతిలో పనిచేసిన వారంతా కవితకు వ్యతిరేకంగా మాట్లాడారు. మేడే రాజీవ్ సాగర్, రాజారామ్ యాదవ్, ప్రశాంత్ వంటి వారు తీవ్ర స్వరంతో కవితను విమర్శించారు. వీరంతా కూడా తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేశారు. గడచిన 18 సంవత్సరాలుగా వీరంతా కూడా కవిత వెన్నంటే ఉన్నారు. ఎప్పుడైతే కవిత భారత రాష్ట్ర సమితిలో ఉన్న కీలక నాయకుల మీద ఆరోపణలు చేయడం.. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వీరంతా విలేకరుల సమావేశం ద్వారా అసలు విషయాలను బయటపెట్టారు.. తామంతా గులాబీ పార్టీలోనే ఉంటామని.. కెసిఆర్ తోనే కొనసాగుతామని.. కారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. దీనికి తోడు కవిత చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.”ఇన్ని రోజులపాటు మేము మీతో పాటు ప్రయాణం చేశాం. ఎన్నడైనా మీరు మా గురించి అడిగారా.. మా గురించి పట్టించుకున్నారా.. మేము ఏం తిన్నాం.. ఎలా ఉన్నాం.. అని అడిగారా లేదు కదా.. అలాంటప్పుడు మిమ్మల్ని కల్వకుంట్ల తారకరామారావు ఎందుకు అడగాలి.. మీ గురించి ఎందుకు పట్టించుకోవాలని” జాగృతి నేతలు ప్రశ్నించారు.
ఒంటరి చేసే ప్రయత్నం
కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక రకంగా భారత రాష్ట్ర సమితి రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది. సోషల్ మీడియాలో కాంగ్రెస్, బిజెపి నాయకులు గులాబీ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కవితకు సంఘీభావంగా మాట్లాడుతున్నారు. దీంతో గులాబీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి కవితకు అండగా ఉన్న వారందరినీ కూడా బయటకు పిలిపించి మాట్లాడించారు. ఆమెకు వ్యతిరేక స్వరం వినిపించేలా చేశారు. మొత్తంగా ఆమెను ఒంటరి చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఇటీవల జాగృతికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని కవిత ఎంపిక చేసిన క్రమంలో.. వీరందరికీ కూడా స్థానం లభించలేదు. బహుశా అందువల్లే కవిత మీద విమర్శలు చేస్తున్నారని జాగృతి నాయకులు అంటున్నారు.. కీలక నాయకులు కవితకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన నేపథ్యంలో.. జాగృతి అధినాయకురాలు ఎలాంటి అడుగులు వేస్తారు.. గులాబీ పార్టీ పెద్దల కుట్రలను ఎలా తిప్పి కొడతారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.