Arvind Dharmapuri: కేసీఆర్ తనయ.. తెలంగాణ అధికార పార్టీ అభ్యర్థి, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను 80 వేలకుపైగా మెజారిటీతో 2019 లోకసభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ధర్మపురి అర్వింద్ ఒక్కసారిగా పొలిటికల్ స్టార్ అయ్యారు. నిజామాబాద్ పసుపు రైతులకు పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసి ఇవ్వడంతో కవితకు పారాభవం తప్పలేదు. అయితే పసుపు బోర్డు తీసుకురావడంలో కాస్త జాప్యం జరిగింది. దాని స్థానంలో మొదట స్పైస్ బోర్డు తెచ్చారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటించారు. దీంతో పడిపోయిన అర్వింద్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లోనూ అర్వింద్ విజయం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే, అర్వింద్ స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నాయకులే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఇటీవల నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ పార్టీ కార్యలయం ముందు ఆందోళన చేశారు. కొద్ది రోజుల క్రితమే అర్వింద్ 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని నిరసిస్తూ ఆందోళన చేశారు.
ఆరని అసంతృప్త జ్వాలలు..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్న భావన అర్వింద్‌పై ప్రజల్లో ఉండగా, నిజామాబాద్ బీజేపీ పార్టీలో అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు, పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్యకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట బాల్కొండ ఇచ్చార్జ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. సేవ్ బీజేపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రాష్ట్రస్థాయిలో పెరిగిన బలం..
రాష్ట్రస్థాయిలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో జిల్లా స్థాయిలో యువత, రైతుల్లో మంచి గుర్తింపు ఉన్న అర్వింద్‌పై స్వపక్షంలోనే వ్యతిరేకత రావడం చర్చనీయాంశమైంది. అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలే పార్టీలో వ్యతిరేకతకు కారణమంటున్నారు. ఎన్నిలక సమయంలో అందరినీ కలుపుకుపోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌తో కొట్లాడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారిని అర్వింద్ దూరం పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జాతీయ, రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి..
బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పరిణామాలపై ఇప్పటికే కొంతమంది నేతలు రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అర్వింద్ ఒంటెత్తు పోకడలను కట్టడి చేయాలని కోరినట్లు సమాచారం. ఇటీవల ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటన సందర్భంగా విభేదాలు బయట పడకుండా రాష్ట్ర నాయకత్వం చూసుకుంది. ఎన్నికల వేళ.. అసంతృప్తులను శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తోంది.
కోరుట్ల బరిలో..
ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని అర్వింద్ భావిస్తున్నారు. నిజాబాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. ఈసారి జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి ఇక్కడ విద్యాసాగర్‌రావు తనయుడు బీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తున్నాడు. ఆయన కూడా కొత్త వ్యక్తి కావడంతో గెలుపు కష్టం కాబోదని అర్వింద్ భావిస్తున్నారు. గతంలో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ బీజేపీకి బలమైన అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు జీవన్‌రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో అర్వింద్ జగిత్యాల జిల్లా కోరుట్లకు మారినట్లు సమాచారం.
ఏది ఏమైనా ఎన్నికల వేళ.. అసంతృప్తిని చల్లాచర్చకుంటే.. పసుపు బోర్డు ఇచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బీజేపీ నాయకత్వం దీనిని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.