Telangana Congress : వనమా వెంకటేశ్వరరావు ఎన్నికచెల్లదు అని హైకోర్టు తీర్పిచ్చింది. తన అనర్హత పిటిషన్ కొట్టేయాలన్న జహీరా బాద్ ఎంపీ బీబీ పాటిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసింది. సేమ్ ఇలాంటి కేసు విషయంలోనే తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సేమ్ ఫలితం ఎదురయింది.. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రోజులు మొత్తం కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోతున్నాయి. పైగా ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులు ఇచ్చిన తీర్పులే.
పాపం వనమా
కొడుకు వనమా రాఘవ చేసిన నిర్వాకంతో ఇప్పటికే తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న వనమా వెంకటేశ్వరరావు.. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరింత అగాధంలోకి కురుకు పోయారు. 2018 ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆయన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ విచారణ తర్వాత వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 నుంచి జలగం వెంకట్రావే కొత్తగూడెం ఎమ్మెల్యే అని ప్రకటించింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీబీ పాటిల్ కు ఎదురు దెబ్బ
జహీరాబాద్ భారత రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ అనర్హతపై సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ విషయంలో ఆయనకు ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్ పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ బీబీ పాటిల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఎంపీగా బీబీ పాటిల్ గెలుపొందారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కే మదన్ మోహన్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను బీబీ పాటిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఎంపీ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రాగా.. అతడి వాదనలో మెరిట్స్ లేనందున పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసి పుచ్చుతూ తీర్పు ఇచ్చింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు దృవపత్రాలు సమర్పించారు అంటూ మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ కు అర్హత లేదని, దానిని కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. కే శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.