Bhatti Vikramarka: మళ్లీ అవమానం.. భట్టి విక్రమార్క ఇప్పటికైనా స్పందిస్తారా?

శనివారం తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్క కు మరో అవమానం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు కావాలని జరుగుతున్నాయా.. లేక యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా తెలియదు గానీ.. ఆ వార్తల్లో వ్యక్తిగా మాత్రం భట్టి విక్రమార్క నిలుస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 7, 2024 1:25 pm

Bhatti Vikramarka

Follow us on

Bhatti Vikramarka: ఆ మధ్య యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల అంకురార్పణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పీటలపై కూర్చుంటే.. భట్టి కింద కూర్చున్నారు. ఈ ఫోటో అప్పట్లో తెగ సర్కులేట్ అయింది. భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా దీనిని ప్రధానంగా ఫోకస్ చేసింది. రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్కను సహించలేకపోతున్నారు అనే కోణంలో వార్తలను ప్రసారం చేసింది. తర్వాత మరుసటి రోజు భట్టి విక్రమార్క ఆ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. తాను కావాలనే ఆలయంలో కూర్చున్నానని.. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు.. దీంతో ఆవివాదం కాస్త సద్దుమణిగింది అసలు ఇంతటి గొడవకు కారణమైన యాదగిరిగుట్ట ఈవో పై ప్రభుత్వం తర్వాత బదిలీ వేటు వేసింది.

ఇక శనివారం తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్క కు మరో అవమానం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు కావాలని జరుగుతున్నాయా.. లేక యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా తెలియదు గానీ.. ఆ వార్తల్లో వ్యక్తిగా మాత్రం భట్టి విక్రమార్క నిలుస్తున్నారు. తుక్కుగూడ ప్రాంతంలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ వద్దకు భట్టి కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని పోలీసులు సభా వేదిక్య వద్దకు అనుమతించలేదు. అంతేకాదు ఆ వాహనాన్ని నిలుపుదల చేసి డ్రైవర్ పై పోలీసులు చేయి చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆ వాహనానికి డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఆ డ్రైవర్ పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చేయి చేసుకున్నారని తెలుస్తోంది. ఆ డ్రైవర్ జేబులోని ఐడి కార్డు లాక్కొని.. వాహనాన్ని నిలిపివేశారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అనంతరం ఆ డ్రైవర్ ను మళ్లీ పిలిపించి.. చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీబీ స్థాయి వ్యక్తితో కొట్టించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత జరిగినప్పటికీ ఆ వీడియోలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని సమాచారం. అయితే ఈ వ్యవహారం ఆ డ్రైవర్ ద్వారా బయటికి పొక్కింది. తరుణ్ జోషి వ్యవహార శైలి పట్ల భట్టి వర్గం రగిలిపోతోంది.

అంతకుముందు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలో భట్టి విక్రమార్క ఫోటో చిన్నగా ప్రచురించారు. కొన్ని ప్రకటనల్లో ఆయన ఫోటో ప్రస్తుతం కాలేదు. తుక్కుగూడ సభకు సంబంధించి వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో భట్టి విక్రమార్క ఫోటో ఒక మూలన పడేశారు. నిన్నగాక మొన్న వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన స్పేస్ భట్టి విక్రమార్క కు ఇవ్వలేదని ఆయన అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రచార ప్రకటనలో పక్కనపెట్టి.. చివరికి కాన్వాయ్ లోని కారును ఆపడం భట్టికి జరుగుతున్న అవమానాలకు పరాకాష్ట అని ఆయన అభిమానులు వాపోతున్నారు. ఇంత జరిగినా అటు భట్టి విక్రమార్క, ఇటు కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉండడం విశేషం.