Hyderabad: హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ప్రాంతంగా ఎదుగుతోంది. ఎత్తైన భవనాలతో, పెద్ద పెద్ద కంపెనీలతో అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు దేశ ఆర్థిక రాజధానితో పోటీపడే స్థాయిలో విస్తరిస్తోంది. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో ఒకప్పటి చెరువులు మాయమైపోతున్నాయి. నాలాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కుంటలు నామరూపాలను కోల్పోతున్నాయి. దీంతో వర్షం వస్తే చాలు హైదరాబాద్ నీట మునుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ కాలువలు ఎక్కడికక్కడ కబ్జాకు గురి కావడంతో అసలు వరద నీరు ప్రవహించేందుకు మార్గం ఉండడం లేదు. దీంతో వర్షాకాలంలో హైదరాబాద్ కాస్త చిన్నపాటి ద్వీపాన్ని తలపిస్తోంది..
ఈ దుస్థితికి వీరు వారు అని కాదు.. అందరూ కారణమే. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీ కార్యకర్తలు కబ్జాలకు తెగబడుతున్నారు. చెరువులను ఆక్రమిస్తున్నారు. కుంటలను మాయం చేస్తున్నారు. నాలాలు కాలగర్భంలో కలిపేస్తున్నారు. ఫలితంగా విశ్వ నగరంగా ఎదిగే అవకాశం ఉన్న హైదరాబాద్ నగరానికి ముంపు ప్రాంతం అనే అపప్రదను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే సరికొత్త వ్యవస్థను రూపొందించారు. ఆ వ్యవస్థకు హైడ్రా అనే పేరు పెట్టారు. దానికి అధికారిగా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ ను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది.
ఇటీవల రంగనాథ్ పని తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంది. ఆ నిర్మాణాలను కూల్చివేసింది. అందువల్లే దానం నాగేందర్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అయినప్పటికీ హైడ్రా తన పనితీరు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇది క్రమంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను పడగొడుతోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవల ఎంఐఎం ఎమ్మెల్యే అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని హైడ్రా పడగొట్టింది. ఆ ఎమ్మెల్యే అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ హైడ్రా అధికారులు ఒప్పుకోలేదు. ఇక ఇటీవల ఓ చెరువులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.. మొత్తానికి కబ్జాలు లేని హైదరాబాదు నగరాన్ని తయారు చేసేందుకు రేవంత్ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మిగతా కాంగ్రెస్ నాయకులు ఎంతవరకు సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. హైడ్రా అధికారులు పడగొడుతున్న భవనాల తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. వీటిపై ప్రజలు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన భవనాలను పడగొట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. మరికొందరేమో ముఖ్యమంత్రి అమెరికా వెళ్లి షెల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా ఇలాగే రద్దు చేస్తారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. ఇంకా కొందరేమో ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల హైదరాబాద్ పరువు పోతున్నదని, ఇప్పటికైనా వీటిని కూల్చివేయడం మంచి చర్య అని కొనియాడుతున్నారు.
రేపటి కోసం..#HYDRA#Telangana #PrajaPalana pic.twitter.com/kCpipIpiIT
— Aapanna Hastham (@AapannaHastham) August 15, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More