Ponnam Prabhakar remarks: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరే ప్రధాన చర్చనీయాంశం గా మారింది. సహచరుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, దళిత నేత అయిన అడ్లూరి లక్ష్మణ్‌ను ‘‘దున్నపోతు’’ అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాదిగ సామాజికవర్గం పార్టీలకు అతీతంగా స్పందిస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్ కూడా పెరుగుతున్న పంచాయితీపై స్పందించారు. అడ్లూరి, పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు కూలిసి పనిచేయాలని ఆదేశించారు.
తన విషయంలో ఒకలా.. సహచరుని విషయంలో మరోలా..
గతంలో తన తల్లిపై బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేసిన పొన్నం, క్షమాపణ కోరించిన విషయం గుర్తుండగానే, ఇప్పుడు తానే అదే పద్ధతిలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు కుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పార్టీ లోపల అసంతృప్తి వ్యక్తమవుతోన్నప్పటికీ, పొన్నం మాత్రం తాను ఎవరినీ ఉద్దేశించి అనలేదని అంటున్నారు. దీంతో విషయం పెద్దదవుతోంది. మరోవైపు కుల ఆధారంగా చేసిన ఈ వ్యాఖ్యలపై మాదిగ సమాజిక నేతలు స్పందిస్తున్నారు. పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ ప్రాధాన్యం ఇవ్వడంతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నంపై చూపుతున్న విశ్వాసం, ప్రాధాన్యం ఈ పరిణామాలకు నేపథ్యంగా నిలుస్తోంది. కీలక నిర్ణయాల సదస్సుల్లో, ముఖ్య సమావేశాల్లో పొన్నానికి ప్రత్యేక స్థానం ఉండడం ఆయనకు అధిక స్థాయిలో ఆత్మవిశ్వాసం కలిగించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ మద్దతే అతనిలో అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడే ధోరణి పెంచిందని భావిస్తున్నారు.
మాటలకే పరిమితం కాకపోతుందా?
ఇంతవరకు పొన్నం వ్యాఖ్యలు మౌఖిక స్థాయిలో ఉన్నా, పార్టీ ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఒకపక్క సీఎం విశ్వాసం, మరోవైపు సామాజిక వర్గాల ఆవేదన మధ్య సమతుల్యం కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది.
తనపై విమర్శలు వచ్చినప్పుడు బాధను వ్యక్తం చేయగలిగిన పొన్నం, తానే వ్యాఖ్య చేసినప్పుడు దానిని సూటిగా అంగీకరించకపోవడం ఆయన రెండు ధోరణులకు ఉదాహరణగా నిలుస్తోంది. రాజకీయ నాయకులకు అవసరమైన ఆత్మపరిశీలన, మానవతా విలువలు ఇలాంటి సందర్భాల్లో మరింత అవసరమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.