HomeతెలంగాణDanam Nagender: కేసీఆర్, రేవంత్ ను ఇరుకున పెట్టిన దానం నాగేందర్

Danam Nagender: కేసీఆర్, రేవంత్ ను ఇరుకున పెట్టిన దానం నాగేందర్

Danam Nagender: రాజకీయ నాయకులన్న తర్వాత అటూ ఇటూ దూకడం కామన్. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి చోటు చేసుకునేది. కానీ గత దశాబ్దం క్రితం నుంచి ఒక పార్టీ మీద గెలిచి, ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడం నాయకులు అలవాటుగా మార్చుకున్నారు. మొత్తానికి అధికార పార్టీలో ఉండేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు టిడిపి, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు మెరుగైన స్థానాలు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది. ఆయనప్పటికీ ఆ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువమంది భారత రాష్ట్ర సమితిలో చేరారు. దీనిని అప్పుడు కెసిఆర్ రాజకీయ పునరేకీకరణ అని ప్రకటించారు.. 2018 ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు.. ఇటీవల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో భారత రాష్ట్ర సమితి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని జోస్యం చెప్పారు. మరి ఇది నిజం అనుకున్నారో? కెసిఆర్ తన ప్రభుత్వాన్ని కూలగొడతారని భావించారో? తెలియదు గాని మొత్తానికి రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తడం ప్రారంభించారు. వాస్తవానికి రేవంత్ మొదట్లో తమ పార్టీలోకి భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేలను ఇప్పుడప్పుడే ఆహ్వానించబోమని, అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తేనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ లోకి ఇటీవల కొంతమంది నాయకులు చేరుతుండడం విశేషం. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరారు. నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయాన్ని భారత రాష్ట్ర సమితి తప్పు పట్టింది. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భారత రాష్ట్ర సమితి గవర్నర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసింది.

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. అటు కెసిఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇరుకున పడ్డట్టయింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనలో చేర్చుకుంది. అలా చేరిన వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత తెలంగాణ ఏర్పాటైన అనంతరం.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్, టిడిపి, బీఎస్పీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఈ ఫిరాయింపులపై అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా.. మరో పార్టీలో చేరిన వారిని ఆ క్షణంలోనే ఉరితీయాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు దానం నాగేందర్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో.. నెటిజన్లు రేవంత్ కు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను.. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన ఫోటోను ఒకచోట చేర్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. దీంతో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అలా చేసిందని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటుంటే.. మొన్నటిదాకా కెసిఆర్ పాలనలో ఏం జరిగిందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి దానం నాగేందర్ ఉదంతం అటు కెసిఆర్, ఇటు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టిందని న్యూట్రల్ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version