Organ Donor Kancharla Subbaraju: తోటివాడు ఆపదలో ఉన్నాడంటే ఆమడ దూరం పారిపోతున్న రోజులువి. అవసరానికి ఆదుకున్న వాడి నెత్తి మీద మన్ను పోస్తూ అడుగుదాక తొక్కుతున్న పాపిష్టి రోజులువి. ఇటువంటి రోజుల్లో ఓ కూలి ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. తాను చనిపోతూ మిగతా వారికి జీవితం ప్రసాదించాడు. స్వార్థం, మోసం, కపటం నిండిన కాలంలో నిస్వార్ధ జీవిగా నిలిచిపోయాడు.
Also Read: బిగ్ బాస్ 9 ‘అగ్నిపరీక్ష’ ఫుల్ ప్రోమో వచ్చేసింది..జడ్జీలు ఇంత కఠినంగా ఉన్నారేంటి!
అతని పేరు కంచర్ల సుబ్బరాజు. వయసు 60 సంవత్సరాల వరకు ఉంటుంది.. గుంటూరు జిల్లా తెనాలి మండలం సోమసుందరిపాలెం అతడి స్వస్థలం. ఇతడి భార్య పేరు కంచర్ల వెంకటలక్ష్మి. సుబ్బరాజు, వెంకటలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుబ్బరాజుది పేద కుటుంబం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతున్నాడు. కనీసం సొంత స్థలం లేదు. ఉండడానికి ఇల్లు కూడా లేదు. వయసు పైబడిన పద్యంలో సోమసుందరపాలెంలో తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈనెల 10న అతడు అచేతనంగా మారిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ధ్రువీకరించారు.
బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల నుంచి అవయవాలు సేకరిస్తారు. దానికంటే ముందు పేషెంట్ కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం. ఇదే విషయాన్ని ఆ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు సుబ్బరాజు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అవయవ దానంపై అవగాహన కల్పించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉన్న వెంకటలక్ష్మి, ఆమె పిల్లలు గుండెను దిటువు చేసుకుని అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బరాజు ఊపిరితిత్తులను చెన్నైలోని ఇద్దరు పేషెంట్లకు.. మూత్రపిండాల్లో ఒకటి రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ కు.. మరొక దానిని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ కు.. లివర్ ను రమేష్ ఆస్పత్రికి.. నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. మొత్తానికి ఏడుగురికి పునర్జీవితాన్ని సుబ్బరాజు కల్పించాడు. సుబ్బరాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్.. ఇతరుడు అభినందించారు. శనివారం సుబ్బరాజు మృతదేహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. అంతేకాదు అవయవదానానికి సంబంధించిన ధ్రువపత్రాలు.. దహన కార్యక్రమాలకు సంబంధించి పదివేల రూపాయలను అందించారు. అంతిమ సంస్కారాలను పెమ్మసాని కార్యదర్శి దగ్గరుండి నిర్వహించారు.