Rs547-cr Cyber Fraud: అతని పేరు ఉడతనేని వికాస్ చౌదరి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో అతడు పుట్టాడు. ఉన్నత చదువులు చదివాడు. కానీ, అతని ఆలోచనలు మొత్తం మోసం చుట్టు తిరిగాయి. కష్టపడి సంపాదించకుండా.. అన్యాయంగా, అక్రమంగా ఆర్జించాలని అతనిలో కోరికలు పుట్టాయి. ఫలితంగా అతనిని సైబర్ నేరగాడిని చేశాయి…
కంప్యూటర్ మీద, సైబర్ వ్యవహారాల మీద వికాస్ చౌదరికి విపరీతమైన పట్టు ఉంది. అది అతడిని మోసాల వైపు నడిపించింది. విదేశాలలో ఉన్న వికాస్ చౌదరి ఆస్ట్రేలియా వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. అతనితోపాటు కొంతమందిని ఒక బృందంగా ఏర్పాటు చేసుకొని దర్జాగా వెనకేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 549.95 కోట్ల సైబర్ మోసానికి పాల్పడ్డాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోనే కాకుండా తెలంగాణలోని అతిపెద్ద సైబర్ మోసం గా ఇది చరిత్రకెక్కింది.
మొదట్లో ఈ మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు మొదలుపెట్టారు. తీగ లాగితే డొంక మొత్తం కదిలినట్టు.. ఈ సైబర్ మోసం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి ప్రాంతానికి చెందిన వికాస్ చౌదరి రింగ్ మాస్టర్ అని తేలింది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే పెనుబల్లి పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పోట్రు ప్రవీణ్, పోట్రు మనోజ్, కళ్యాణ్, మేడా కళ్యాణ్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వికాస్ చౌదరి ఈ సైబర్ మోసానికి ఆరుగురిని నియమించుకున్నాడు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మోసంలో మరో 17 మంది బ్యాంకు అకౌంట్లు ఇచ్చారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో కీలకమైన పాత్రధారి ఉడతనేని వికాస్ చౌదరి. ఇతడు పోలీసులకు చిక్కినట్టు చిక్కి తప్పించుకుంటున్నాడు. కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ వికాస్ చౌదరిని పట్టుకోడానికి పెనుబల్లి ఎస్ఐని హైదరాబాదులోనే మకాం వేయించారు. మరోవైపు వికాస్ చౌదరి అధికార పార్టీ చెందిన ఓ నాయకుడికి తోడల్లుడి కుమారుడు అని తెలుస్తోంది. అందువల్లే ఇతడి అరెస్టులో జాప్యం ఏర్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికాస్ చౌదరి అరెస్ట్ చేయకుండా పొలిటికల్ పవర్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి వికాస్ చౌదరిని పోలీసులు ఈ కేసులో ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి రావడంతో అతడిని విడిపించారని సమాచారం. ఈ కేసులో ఆరుగురు అతి ప్రధాన నిందితులు ఉన్నారు . వారిలో పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి గులాబీ పార్టీ నాయకుడు. పోట్రు మనోజ్ కళ్యాణ్ బిజెపిలో నాయకుడిగా ఉన్నారు. మరోవైపు వికాస్ చౌదరిని అరెస్ట్ చేయడానికి వసుంధర యాదవ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం వికాస్ చౌదరి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.