Konda Surekha: అయ్యో కొండా సురేఖ.. మొన్నటి వరకు సింపతి.. నిన్నటి నుంచి విమర్శలు.. బెడిసి కొట్టిన సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రెండు రోజులుగా కొండా సురేఖ అంశం సంచలనం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఆమె ఫొటోను ట్రోల్‌ చేయడంపై నిన్నటి వరకు అంతటా సానుభూతి వ్యక్తమైంది. కానీ, కేటీఆర్‌ టార్గెట్‌గా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు భూమరాంగ్‌ అయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : October 3, 2024 11:10 am

Konda Surekha

Follow us on

Konda Surekha: తెలంగాణ దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల మెదక్‌ జిల్లాలో పర్యటించారు. అక్కడ జరిగిన ఓ ఘటనపై సోషల్‌ మీడియాలో ఓ పోస్టు వైరల్‌ అయింది. దీనిపై మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తనను ట్రోల్‌ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తరఫున కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఉద్యమించాయి. తెలంగాణ భవన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో మంత్రిపై మొన్నటి వరకు సానుభూతి వ్యక్తమైంది. మహిళా మంత్రిని ట్రోల్‌ చేయడాన్ని చాలా మంది తప్పు పట్టారు. కొండా సురేఖకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే మంత్రి ఆ హైప్‌ను కొనసాగించేలా.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను టార్గెట్‌ చేశారు. తనపై ట్రోలింగ్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్‌ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తుంటే తను ట్రోల్‌ చేయమని కేటీఆరే బీఆర్‌ఎస్‌ శ్రేణులకు చెప్పినట్లు ఉందని ఆరోపించింది. అంతటితో ఆగకుండా కేటీఆర్‌కు మహిళలపై గౌరవం లేదని తెలిపేందుకు బుధవారం(అక్టోబర్‌ 2న) సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్‌ అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆయన భయానికే త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని, నాగచైతన్య–సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని, కేటీఆర్‌ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్‌ పార్టీలు పెట్టారని విమర్శించారు.

తిరగబడిన సిని ఇండస్త్రీ..

కేటీఆర్‌ను మహిళా వ్యతిరేకిగా చిత్రీకరించేందకు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు భూమరాంగ్‌ అయ్యాయి. నిన్నటి వరకు ట్రోల్‌తో బోలెడు సానుభూతి కూడగట్టుకున్న కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆ సానుభూతి మొత్తం పోయింది. పైగా సినిమా ఇండస్ట్రీ తిరగబడింది. బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి మొదలు పెట్టింది. మంత్రి వ్యాఖ్యలపై మొదట నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని, సినిమావాళ్లు అంటే అంత చుటకనా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఇక తన విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై నటి సమంత కూడా ఘాటుగా స్పందించారు. తన విడాకులు పూర్తిగా వ్యక్తిగతమని, వాటి గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరారు. తన ప్రయాణానికి గర్వపడుతున్నానని, దానిని చిన్నచూపు చూడొద్దని పేర్కొన్నారు.

మండిపడ్డ నాగచైతన్య, అమల
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అమల కూడా స్పందించారు. ‘గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాలకు దూరంగా ఉండే సిని ప్రముఖుల జీవితాలను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. మహిళాగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబంపై చేసిన ఆరోపణలు అబద్ధం. అసంబంధ్దం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ఎక్స్‌లో పోస్టు చేశారు. తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ పోస్ట్‌ను నాగచైతన్య రీట్వీట్‌ చేశారు. మరోవైపు నాగార్జున సతీమణి అక్కినేని అమల సైతం ఈ అంశంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి తమను లాగకండి. ఓ మహిళా మంత్రిగా నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్‌గాంధీ చొరవ తీసుకోవాలని ఆమె ట్వీట్‌లో పేర్కొంది.

కేటీఆర్‌ లీగల్‌ నోటీసు..

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తపుప పట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొండా సురేఖ చేసిన ఆరోపణలుతన గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసమే తన పేరు వాడుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్‌ కేసు పెడతానని హెచ్చరించారు.

మంత్రి మాటలను తప్పుపట్టిన స్మితా సబర్వాల్‌..
ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ కూడా స్పందించారు. సంచలనాల కోసం కొందరు ఇతరులపై వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా ఎదుర్కొన్నాను. ఒంటరిగా ఎదగడం సమాజంలో అంత సులభం కాదు. అలంటి వారిపై అపవాదు వేయకుండా గౌరవించాలి. మంత్రి కొండా సురేక వ్యాఖ్యలు చూసి షాక్‌ అయ్యాను. రాజకీయాల కోసం వ్యక్తులు జీవితాలన వాడుకోవద్దు’ అని ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

తగ్గిన కొండా సురేఖ..
తాను చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తుండడంతో మంత్రి కొండా సురేఖ వెనక్కు తగ్గారు. ‘కేటీఆర్‌ నన్ను కించపరిచే విధంగా మాట్లాడాడు. నేను వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడాను. అనుకోకుండా నా నోట్లో నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత నాకు బాధనిపించింది. ఆ కుటుంబాన్ని నా వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డాను. నేను పడ్డ బాధ వాళ్లు పడకూడదనే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాను’ అని తెలిపారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. సమంత ఎదిగిన తీరు తనకు స్ఫూర్తిదాయమని అన్నారు.

కేటీఆర్‌పై లీగల్‌ చర్యలు..
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గనని కొండా సురేఖ పేర్కొన్నారు. కేటీఆర్‌ తనకు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. దొంగే దొంగ అనేలా కేటీఆర్‌ ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌పై లీగల్‌గా ముందుకు వెళ్తా్తనని తెలిపారు.