CP Sai Chaitanya: కొంతమంది పోలీసులను మినహాయిస్తే.. నేటికీ ధర్మబద్ధంగా.. న్యాయబద్ధంగా పనిచేసే పోలీసులు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అందువల్లే శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. లేకపోతే వారు కూడా మిగతావారు లాగానే వ్యవహరిస్తే రౌడీలు రెచ్చిపోతారు. హంతకులు స్వైర విహారం చేస్తారు. సంఘవిద్రోహులు దుర్మార్గాలకు పాల్పడతారు. ఇలాంటి రాజ్యాంగేతర శక్తులను అణచివేయడానికి పోలీసులు చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లవచ్చు. అలా ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ దారుణమైన హత్యకు గురయ్యాడు. వాస్తవానికి నిందితుడు పాల్పడిన దుర్మార్గానికంటే.. సమాజం చేసిన నిర్లక్ష్యమే అతని ప్రాణం పోవడానికి కారణమైంది.
ఇదే విషయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న సాయి చైతన్య వెల్లడించారు.. సాయి చైతన్య మాట్లాడిన మాటలు మన సమాజంలో ఉన్న నిర్లక్ష్యాన్ని నిరూపిస్తున్నాయి. “”కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచి వేసింది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం. తమ కళ్ళముందే గోరం జరుగుతున్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా కొందరు వ్యవహరించారు. కానిస్టేబుల్ కు తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నప్పటికీ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం బాధాకరం. సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. విధినిర్వహణలో దారుణ హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం.” ఇదీ నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్విట్టర్లో చేసిన ట్వీట్.
వాస్తవానికి ప్రమోద్ పై నిందితుడు దాడికి పాల్పడుతున్నప్పుడు చుట్టుపక్కల వారు స్పందించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అతని ప్రాణం నిలబడేది. కానీ చుట్టుపక్కల వారు ఆ పని చేయలేదు. పైగా తమకెందుకు అన్నట్టుగా వ్యవహరించారు. దీంతో సాయం చేసేవారు లేక.. దౌర్జన్యాన్ని అడ్డుకునేవారు కానరాక ప్రమోద్ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు విధి నిర్వహణలో ఎంతో త్యాగం చేస్తే ఈరోజు శాంతిభద్రతలు ఈ విధంగా ఉన్నాయి. మన స్వేచ్ఛగా బతికే అవకాశాన్ని కల్పించాయి. కానీ అటువంటి పోలీసులకే ఆపద వస్తే పౌర సమాజం చూస్తూ ఉండిపోవడం.. ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడం నిజంగా బాధ్యతారాహిత్యం.
అన్నట్టు సిపి సాయి చైతన్యకు మంచి రికార్డు ఉంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారని పేరు కూడా ఉంది. కానిస్టేబుల్ అంత్యక్రియల్లో సిపి ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. చివరికి తన భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నారు. సాయి చైతన్య ఇటీవల నిజామాబాదులో సైబర్ క్రైమ్ జరిగినప్పుడు.. ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిపై పీడి యాక్ట్ నమోదు చేశారు. మన రాష్ట్రంలో ఒక సైబర్ నేరగాడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన ఘనతను సాయి చైతన్య సొంతం చేసుకున్నారు.. ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను చేపట్టడంలో సాయి చైతన్య ఎప్పటికీ ముందుంటారు. నేరాలను అదుపు చేయడంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు విభిన్నమైన పంథాను అనుసరిస్తుంటారు.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం.
తమ కండ్లముందే ఘోరం జరుగుతున్న తమకేం పట్టనట్టుగా కొందరు వ్యవహారించారు. కానిస్టేబుల్కు తీవ్ర రక్తస్రావం… pic.twitter.com/XAgYWErlzV
— P. Sai Chaitanya, IPS (@ChaitanyaIPS) October 18, 2025