Congress Vs BRS: కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. మళ్లీ మొదలైన ‘సోషల్‌’ వార్‌.. రంగంలోకి దిగిన వ్యూహకర్త!

తెలంగాణ రాజకీయాల్లో సోషల్‌ మీడియా కీలకంగా మారింది. గెలుపోటములను నిర్దేశిస్తోంది. గతంలో టీవీ ఛానెళ్లు, పత్రికల్లో ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్‌ భ్రావం ఉండేది. ఇప్పడు సోషల్‌ మీడియానే కీలకంగా మారింది.

Written By: Raj Shekar, Updated On : August 9, 2024 1:36 pm

Congress Vs BRS

Follow us on

Congress Vs BRS: సోల్‌ మీడియా.. సోషల్‌ మీడియా.. సోషల్‌ మీడియా.. ఇప్పుడు ఎవరి చేతిలో ఫోన్‌ చూసినా.. ప్రతీ పదినిమిషాలకోసారి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా సైట్లలోనే ఉంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్‌ మీడియానే ప్రపంచంగా మారింది. 2014 నుంచి ఈ సోషల్‌ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ఎన్నికల్లో సోషల్‌ మీడియా గెలుపోటములను ప్రభావితం చేస్తుందని తొలిసారి నిరూపితమైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ సోషల్‌ మీడియా వింగ్‌ అద్భుతంగా పనిచేసింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి.. అప్పటి వరకు అధికారంలో ఉన్న యూపీఏ ఓటమికి కారణమైంది. తర్వాత 2019 నాటికి ఇది మరింత పెరిగింది. మోదీ మేనియాతోపాటు సోషల్‌ మీడియా ప్రభావంతో బీజేపీ 2014 కన్నా ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. దీనిని గుర్తించిన కాగ్రెస్‌ 2024 నాటికి కాంగ్రెస్‌ పార్టీ కూడా తన సోషల్‌ మీడియా వింగ్‌ను బలోపేతం చేసుకుంది. అయితే దీని ప్రభావంతోనే 2024 ఎన్నికల్లో బీజేపీ స్థానాలను తగ్గించగలిగింది. 2029 నాటికి బీజేపీని ఓడించినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. ఇలా సోషల్‌ మీడియా ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తోంది. దీంతో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు పార్టీ పరంగా.. సర్పంచ్‌ నుంచి ఎంపీ వరకు వ్యక్తిగతంగా సోషల్‌ మీడియా ఖాతా మెయింటేన్‌ చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా… సోషల్‌ మీడియాలోనే దానిని పంచుకుంటున్నారు. దీంతో ‘సోషల్‌’ బలమే ఇప్పుడు తమ బలంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఇక తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా విపరీతమైన ప్రభావితం చూపింది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఛానెళ్లను కొనేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచారం చేయించింది. కానీ, అప్పటికే బీఆర్‌ఎస్‌ పాలనపై ఉన్న వ్యతిరేకత, క్యూ న్యూస్‌తోపాటు కొన్ని సోషల్‌ మీడియా ఛానెళ్లు అప్పటికే బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ప్రచారంతో జనాళ్లోకి వెళ్లాయి.

కేటీఆర్‌ పదే పదే ప్రస్తావన..
గత బీఆర్‌ఎస్‌ పాలనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌.. సోషల్‌ మీడియా ప్రభావాన్ని గుర్తించారు. అయితే అప్పటికే కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో దూకుడు పెంచింది. వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సోషల్‌ మీడియాను స్ట్రెంథెన్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్‌ ఓటమి తర్వాత ఎక్కడ మాట్లాడినా తమ ఓటమికి సోషల్‌ మీడియానే కారణం అని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో వెనకబడటం వల్లే ఓడిపోయామన్నది కేటీఆర్‌ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌.

కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి..
ఇదిలా ఉంటే.. కేటీఆర్‌ రిపోర్టు కొంత వరకు వాస్తవమే. అప్పట్లో సహజంగానే పదేళ్ల పాలనా వైఫల్యాలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వింగ్‌ బాగానే ఎండగట్టింది. ఇప్పుడు అదే సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ను వెంటాడుతోంది కేటీఆర్‌ టీం. కొత్త ఛానెళ్లు, కొత్త హ్యాండిల్స్‌తో కాంగ్రెస్‌ అడుగు తీసి అడుగు వేసినా కామెంట్‌ చేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ తప్పనిసరిగా ప్రతిస్పందించాల్సి వస్తోంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా టీమ్స్‌ స్పీడ్‌ కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా స్ట్రెంథెన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. దీంతో వ్యూహకర్త సునీల్‌ కనుగోల్‌ టీం మరోమారు రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. గత పదేళ్లు బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులను మరోసారి ఎత్తి చూపేందుకు సిద్ధమవుతోంది.

సోషల్‌ రిక్రూట్‌మెంట్‌..
ఎన్నికల సమయంలో చాలా యాక్టివ్‌గా ఉన్న కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వింగ్‌.. ఎన్నికలయ్యాక ఉద్యోగులను తగ్గించింది. దీంతో దాని ప్రభావం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు దానిని బలోపేతం చేయడంలో భాగంగా మరోమారు రిక్రూట్‌మెంట్‌ చేపట్టింది. సోషల్‌ మీడియా వింగ్‌ లోనే ఎక్కువ నియామకాలు చేస్తోందని సమాచారం. రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఫేక్‌ కంపెనీలతో అంటూ బీఆర్‌ఎస్‌ మూడు రోజులుగా చేస్తున్న ఆరోపణలకు గతంలో మీరు చేసిన ఒప్పందాల సంగతేంటి అంటూ పాత ఒప్పందాలను బయటకు తీస్తోంది.

పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మళ్లీ సోషల్‌ వార్‌ తప్పేలా లేదు. అంశం ఏదైనా విమర్శకు ప్రతి విమర్శతో రెడీగా ఉండేలా సోషల్‌ మీడియా వింగ్‌ను రెడీ చేస్తోంది కాంగ్రెస్‌. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి బర్త్‌ డే ఫొటోల విమర్శలకు గతంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల బర్త్‌డే హంగామా వీడియోలతో కౌంటర్‌ ఇచ్చింది. ఇలా ప్రతి అంశానికి బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ ఇస్తోంది కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా.