KCR Health: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు మొదటిసారి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం కొత సచివాలయంలో రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేబినెట్ భేటీ నిర్వహించారు. మరోవైపు శనివారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాలుజారిపడ్డ కేసీఆర్..
గురువారం సాయంత్రం అసెంబ్లీ సమావేశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బాత్‌రూంలో జారిపడ్డారు. వాష్‌రూంకు వెళ్లిన ఆయన అదుపు తప్పి జారి పడడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేసిన వైద్యులు పాదం వద్ద ఫ్యాక్చర్ అయినట్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం హెల్త్ బులిటెన్..
ఇక కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో కేసీఆర్ కాలుకు మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయినట్లు వెల్లడించారు. సర్జరీ చేయాల్సి ఉంటుందని, అవసరమైతే హిప్ మార్చాల్సి ఉంటుందని తెలిపారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే హిప్ మార్పిడిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సర్జరీ అయితే కనీసం 10 నుంచి 15 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. మరోవైపు కేసీఆర్ వయసు దృష్ట్యా, సర్జరీకి అవసరమైన అన్ని పరీక్షలు చేసిన తర్వాత సర్జరీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కాంగ్రెస్ సెటైర్లు..
అయితే కేసీఆర్ అధికారం కోల్పోవడంతో తీవ్రంగా మదన పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అతిగా మద్యం తాగి జారిపడి ఉంటారని పేర్కొంటున్నారు. కొందరేమో.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రమాణం చేయాల్సి ఉంటుందని, ఈ సమయంలో ఎదురుపడే సీఎం రేవంత్‌రెడ్డికి నమస్కారం చేయాల్సి ఉండడంతో కాలుజారిన డ్రామా మొదలు పెట్టారని, ఇవి పూర్తిగా పీకే డైరెక్షన్‌లో జరుగుతుందని అంటున్నారు.
గ్రీన్‌చానెల్ ఏర్పాటు..
ఇదిలా ఉండగా, కేసీఆర్ కాలుజారి పడిన సమాచారం అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.