Praja Darbar: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన విధంగా.. జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు భారీగా ప్రజాభవన్‌కు తరలి వచ్చారు. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఎక్కువగా వచ్చారు. ముందుగా ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లో ప్రజల వినతిపత్రాల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపించారు. ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ స్వయంగా ఆర్జీలను స్వీకరించారు. క్యూలైల్లో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ధరణి బాధితులే ఎక్కువ..
= ఇక ప్రజాదర్బార్‌కు వచ్చిన వారిలో ధరణి బాధితులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ధరణి పోర్టల్‌తో తమ భూములు తమకు దక్కకుండా పోయాయని, తమ పేరిట ఉన్న భూములను వేరేవారి పేరిట ఎక్కించారని, కబ్జాలో ఉన్నా.. ధరణిలో తమ పేరు రావడం లేదని, గతంలో అమ్మినవారి పేర్లు ధరణిలో వస్తున్నాయని పలువురు సీఎం రేవంత్‌కు విన్నవించారు.
= ఇక తర్వాత మల్లన్నసాగర బాధితులు కూడా ఎక్కువగానే వర్చారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ముప్పుకింద ప్రభుత్వానికి అప్పగించి ఎక్కువ మొత్తంలో పరిహారం పొందారని కొందరు, కొందరు తమకు పరిహారం రాలేదని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని వెల్లడించారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములు ప్రభుత్వం లాక్కుందని కొందరు ఫిర్యాదు చేశారు.
= నిరుద్యోగులు కూడా భారీగా ప్రజాభవన్‌లోని ప్రజాదర్బార్‌కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇస్తామన్న గత ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫకేషన్లు పేపర్ లీకేజీలతో రద్దయ్యాయని, నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావడం లేదని సీఎం రేవంత్‌కు విన్నవించారు.
= దివ్యాంగులు కూడా ప్రజాదర్భార్‌కు అధికంగా వచ్చారు. మానసిక, అంగ వికలాంగులు వచ్చి.. తమకు ఏళ్లుగా ఫింఛన్ రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు.
= డబుల్‌బెడ్రూం ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని, అనర్హులకు కేటాయించారని, బీఆర్‌ఎస్ నేతలకే ఇళ్లు మంజూరు చేసుకున్నారని, తమకు అర్హత ఉన్నా ఇవ్వలేదని కొందరు, మరికొందరు ఇల్లు ఇప్పిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని తెలిపారు. ఈమేరకు సీఎంకు ఫిర్యాదు చేశారు.
= బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సాగించిన దౌర్జన్యాలు, భూకబ్జాలపై కూడా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారని వెల్లడించారు.