Congress Party Social Media: మంత్రుల మధ్య సయోధ్య లేదు. చివరికి సాటి మంత్రిని మరో మంత్రి దున్నపోతు అని అనడానికి కూడా వెనుకాడడం లేదు. ఇది వివాదానికి కారణమైంది.. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. మధ్యలోకి కుండా సురేఖ కుమార్తె సుస్మిత రావడంతో ఆ వివాదం మారింత పెరిగింది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆ వివాదం తాత్కాలికంగా ముగిసినప్పటికీ పార్టీకి విపరీతమైన డ్యామేజ్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముసలం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన బీటెక్ వంశీ అలియాస్ వంశీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నందుకు గల కారణాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను తాము కష్టపడి నిలబెట్టుకున్నామని.. కానీ చూస్తుండగానే అది కూలిపోతోందని.. దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ కారణమని వంశీ తన పోస్టులో పేర్కొన్నారు. గుండె బరువెక్కి, ఆవేదనతో రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.. పార్లమెంట్ ఎన్నికల వరకు సోషల్ మీడియాలో ఎటువంటి సమస్య లేదని.. తమ పూర్తి స్వేచ్ఛతో పని చేశామని.. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులు సోషల్ మీడియాలోకి వచ్చారో.. అప్పుడే పరిస్థితులు మారిపోయాయని వంశీ పేర్కొన్నారు. సోషల్ మీడియా పై ఎటువంటి అవగాహన లేని వ్యక్తులను తీసుకొచ్చారని.. వారంతా కూడా కష్టపడి పని చేసిన తన లాంటి వారిని అవమానానికి గురి చేశారని వంశీ తన లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగాలు మానేసి.. పార్టీ కోసం కష్టపడిన సోషల్ మీడియా కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని కోరితే.. వివిధ కారణాలను చెబుతూ దాటవేశారని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉంటే ఉండండి.. పోతే పొండి అంటూ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని వంశీ పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ.. ఇప్పటికీ తమను మభ్య పెడుతూనే ఉన్నారని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో తనకు మాత్రమే కాదని.. అందరికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని వంశీ వివరించారు.
“ఇతర విభాగాల చైర్మన్ల ను మార్చినట్టే.. సోషల్ మీడియా చైర్మెన్ కూడా మారితే పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నించాం. ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ అందరికీ చెప్పుకుంటూ వచ్చాం.. మీ కార్యాలయంలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు పార్టీ పదవులు ఇచ్చారంటే పార్టీలో మీకెంత పవర్ ఉందో ఊహించగలం. కానీ ఆ పవర్ ను పనిచేసిన కార్యకర్తల కోసం ఉపయోగించి ఉంటే ఒకరైన బాగుపడేవారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించారు. 10 సంవత్సరాలు గులాబీ పార్టీ ప్రభుత్వ ఫలాలు పొంది.. పదవులు అనుభవించిన వారికి.. కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం కృషి చేసిన వారికి పదవులు ఇవ్వడం దేనికి.. ఇది పార్టీలో అంతర్గత సమస్యలను తెచ్చిపెడుతుంది కదా.. చివరిగా నేను చెప్పేది ఒకటే విషయం.. పార్టీ అనేది కార్యకర్తల సమూహం. వారికి గౌరవం ఇవ్వాలి. కార్యకర్తలను ఉద్యోగులుగా మార్చుకోవాలి అను చూడడం దారుణం. పార్టీని చెప్పుచేతల్లో ఉంచాలనుకోవడం పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు మాత్రమే కాదు. అంతకుమించిన శ్రమ ఉంటుంది. పార్టీ ఏజెండాను 365 రోజులు ప్రజలకు చేరవేసిన చరిత్ర మాది. అటువంటి వేలాదిమంది కార్యకర్తలకు కృషి చేస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఈ రాజీనామా వెనుక ఎవరి బలవంతం లేదు. పూర్తిగా నా వ్యక్తిగతం. ఇకనుంచి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా మాత్రమే పనిచేస్తాను. నా రాజీనామాతో నైనా పార్టీ నాయకత్వం మారాలి. పార్టీలో పని చేసే సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయం చేయాలని” వంశీ ఆ పోస్టులో పేర్కొన్నారు.
కష్టపడి నిలబెట్టుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా కళ్ళెదుటే కూలుతుంటే, అందుకు కారణం సోషల్ మీడియా చైర్మనే అయితే, గుండె బరువెక్కి ఆవేదనతో చేస్తున్న రాజీనామా.
పార్లమెంటు ఎన్నికల వరకు సోషల్ మీడియాలో ఎలాంటి సమస్య లేదు. మేము పూర్తి స్వేచ్ఛతో పని చేశాము. పార్టీకి ఎప్పుడు చెడ్డపేరు రాకుండా… pic.twitter.com/AZbHY4H4NQ
— VamshiBTech (@VamshiBtech) October 21, 2025