Ram Mohan Naidu: తెలుగు రాష్ట్రాల నుంచి యువ నేతల్లో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapur Ram Mohan Naidu ). దివంగత ఎర్రం నాయుడు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. తండ్రి మాదిరిగానే ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించి.. తన కంచుకోటగా మార్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీస్తున్న సమయంలోనే.. తన గెలుపుతో మంచి సంకేతం పంపించారు. అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ కు వీర విధేయుడుగా గుర్తింపు సాధించారు. ఆ గుర్తింపుతోనే మూడోసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
* చేదు అనుభవాలు..
రాజకీయంగా ఎదిగిన రామ్మోహన్ నాయుడుకు.. తాను నిర్వర్తిస్తున్న శాఖ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వాస్తవానికి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించేటప్పుడు అనేక రకాల వ్యాఖ్యలు వినిపించాయి. అది ఆయనకు సరైన శాఖ కాదన్న వాదనలు వినిపించాయి. కానీ భారత ప్రభుత్వంలో( Indian government) పౌర విమానయాన శాఖకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆ శాఖను నిర్వర్తించిన రామ్మోహన్ నాయుడుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు మినహా అందరూ సజీవ సమాధులయ్యారు. దీనికి తోడు మెడికల్ కాలేజీ హాస్టల్ పై విమానం కూలడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. 260 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది విమానయాన శాఖకు మాయని మచ్చ.
* ఇండిగో వివాదం..
మొన్నటికి మొన్న ఇండిగో( Indigo) వివాదం మరోసారి రామ్మోహన్ నాయుడు ను వార్తల్లో నిలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఎయిర్లైన్స్ నిబంధనల మేరకు.. పైలెట్లకు 48 గంటల పాటు విశ్రాంతి తప్పనిసరి. అయితే దీనిపై సిబ్బంది కొరత అని చూపుతూ ఇండిగో ఎయిర్లైన్స్ తన సర్వీసులను నిలిపివేసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వేల విమాన సర్వీసులను నిలిపివేయడంతో విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లుగా మారిపోయాయి. వేలాదిమంది సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక విమానాశ్రయాల్లోనే పడిగా పుల్ పడాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పౌర విమానయాన శాఖ వైఫల్యం ఇది అని విమర్శలు వచ్చాయి.
* తాజా ప్రమాదంతో
తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్( Maharashtra deputy CM Ajit Pawar ) విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలంటూ కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఇప్పటికే AAIB దర్యాప్తు ప్రారంభించింది. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుంది. అయితే పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు తనదైన ముద్ర చూపుతున్నారు. కానీ తనకు సంబంధం లేని ప్రమాదాలు శాఖా పరంగా ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న రామ్మోహన్ నాయుడుకు ఇవి ఇబ్బందికర పరిస్థితులే. అయితే ఈ పరిస్థితులను ఒక గుణపాఠాలుగా మార్చుకుంటానని రామ్మోహన్ నాయుడు ఇదివరకే ప్రకటించారు.