Kandukur Lakshmi Naidu Incident: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలనే షేక్ చేసింది కందుకూరు ఘటన. 1988లో వంగవీటి మోహన్ రంగా హత్య జరిగిన సమయంలో రేగిన పరిణామాలే ఇప్పుడు కూడా కనిపించాయి. తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సామాజిక వర్గాల మధ్య తీవ్ర కలకలం రేగింది. ప్రధానంగా వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిన ఈ నేరానికి కొన్ని రాజకీయ వర్గాలు, కుల సంఘాలు రాజకీయ రంగు పులమడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మయ్య నాయుడుని అదే ప్రాంతానికి చెందిన హరిచంద్ర ప్రసాద్ కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు అనేది ప్రధాన ఆరోపణ. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయని పోలీసులు సైతం గుర్తించారు. ఈ గొడవలే హత్యకు దారితీసాయి. పోలీసులు హరిచంద్ర ప్రసాద్ తో పాటు అతని తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
* ఆ రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్..
మొన్నటి ఎన్నికల్లో కాపు, కమ్మ సామాజిక వర్గం సమన్వయంతో ముందుకు సాగాయి. కూటమి అధికారంలోకి రావడానికి కారణం అయ్యాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) కూటమికి అండగా నిలబడ్డారు. గత 16 నెలలుగా ప్రభుత్వం సజావుగా ముందుకు సాగడంలోనూ.. కూటమి పార్టీల మధ్య ఐక్యతలోనూ పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఎంత మాత్రం రాజకీయ ప్రత్యర్థులకు రుచించడం లేదు. అందుకే కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లక్ష్మయ్య నాయుడు హత్య జరిగింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నిందితుడు హరిచంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి వ్యతిరేక కాపు సంఘాలు తెరపైకి వచ్చాయి. ఇది కులపరమైన హత్య అని.. దీని వెనుక టిడిపి అధినేత చంద్రబాబు హస్తము ఉందని ఆరోపించడం మొదలుపెట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించడం ప్రారంభించాయి. కమ్మ సామాజిక వర్గం నేత చనిపోతే చంద్రబాబు పరామర్శిస్తున్నారని.. కాపులు చనిపోతే పవన్ ఎందుకు పరామర్శించడం లేదని నిలదీస్తున్నాయి. ఈ సంఘటన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపు వర్గాల్లో ఆగ్రహాన్ని రాజేయడానికి చలో కందుకూరు వంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు.
* క్లారిటీ ఇచ్చిన కుటుంబం..
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మృతుడు లక్ష్మయ్య నాయుడు( lakshmaya Naidu) భార్య, కుటుంబ సభ్యులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబానికి, నిందితుడికి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని.. దీనికి రాజకీయాలతో కానీ.. కులాలతో కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు హత్యకు గురైన లక్ష్మయ్య నాయుడు సైతం టిడిపి కార్యకర్త అని తెలుస్తోంది. అయితే కాపు కుల సంఘాల్లో కొన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అవి రంగంలోకి దిగి రాజకీయ ప్రయోజనాల కోసం కాపుల్లో అగ్గిరాజు చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఈ ఘటనపై హోం మంత్రి అనిత తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వ్యక్తిగత ఆర్థిక వివాదం గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
* రంగా హత్య మాదిరిగా..
వాస్తవానికి 1988లో జరిగిన రంగా హత్య మాదిరిగా దీనిని కూడా రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని చూసాయి కొన్ని రాజకీయ పార్టీలు. ప్రధానంగా ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ ముసుగులో ఫేక్ ప్రచారాలు, ప్రజల మధ్య అంతరాలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు లక్ష్మయ్య నాయుడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్థిక సాయం ప్రకటించింది. లక్ష్మయ్య నాయుడు హత్య నేపథ్యంలో జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లక్ష్మయ్య నాయుడు భార్యకు రెండు ఎకరాలు, ఇద్దరు పిల్లలకు చిరు రెండు ఎకరాల భూమి కేటాయించారు. భార్యతో పాటు పిల్లల పేరుతో 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు. కేసు విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. గాయపడిన వారికి కూడా భూమి, ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.