Congress local leaders: పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే పదవులు వరిస్తాయని మాటలు కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో కూడా అమలు చేసేందుకు తెలంగాణలో కార్యాచరణ రూపొందించింది. పార్టీ మనుగడకు పునాది రాళ్ళుగా నిలిచే కార్యకర్తలకు, నాయకులుగా ఎదిగేందుకు ఇది చక్కటి అవకాశం. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఈ ప్రక్రియతో పార్టీ మరింత బలపడుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధిఫలాలు, ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ఎలుగెత్తిచాటడంలో కార్యకర్తనే ముందుంటాడు. వారి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ సంస్థగత ఎన్నికల్లో పటిష్టమైన నాయకులను ఎన్నుకొని, స్థానిక ఎన్నికల సమరానికి వెళ్లాలనే యోచన మంచిఫలితాలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.
Also Read: RK phone tap : సర్ ప్రైజ్ : ట్యాప్ అవ్వని ఫోన్ వాడే ఆంధ్రజ్యోతి ఆర్కే కాల్స్ కేసీఆర్ విన్నాడట..
గ్రామంలో సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఏ పదవి కావాలన్నా, ట్రాక్ రికార్డు ఖచ్చితంగా చూడాలని, పార్టీకి సేవ చేసిన, చేస్తున్న వారికి మాత్రమే పార్టీ, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, వారిని పార్టీ కార్యకర్తలు, ప్రజల సమక్షంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయాలనే ఆలోచన సరికొత్త అధ్యాయానికి నాంది అని చెప్పుకోవచ్చు. దారిలో పోయే దానయ్యలను పిలిచి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి నష్టం వస్తుందని అధిష్టానం గ్రహించింది. గ్రామస్థాయిలో బూత్ నాయకుడైన ప్రజలకు చేదోడు, వాదోడుగా నిలిచే వారు, మంచి, చెడ్డలు పట్టించుకునే వారు నాయకునిగా రూపుదిద్దుకుంటారు. వారికి పార్టీ అవకాశం కల్పించడం వల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుంది. దీంతో ఆ నాయకుడు బలంగా ఉంటే క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడుతుంది.
బలమైన పునాదులు ఏర్పరచుకున్న ఏ పార్టీకి అయినా మనుగడకు ఢోకా లేదని చరిత్ర చెబుతున్నది. ఈ విషయంలో అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలు తూచా తప్పకుండా శిరసాహవిస్తూ పార్టీని ముందుకు నడపడంలో ప్రతీ కార్యకర్త తన బాధ్యతను గుర్తెరుగుతాడనేది నిర్వివాదాంశం. ఈ ఆలోచనలో శాస్త్రీయత కనిపిస్తోంది. ప్రజల గురించి, ఆయా గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, కేవలం కాంట్రాక్టులు, పైరవీల కోసం మాత్రమే తాపత్రయం పడే వాళ్లు నాయకులుగా ఎదగడం కష్టమే. వారికి పదవులు వస్తే ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. వారివల్ల పార్టీకి దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది. ఏ నాయకుడి వల్ల ప్రజా ప్రయోజనాలు చేకూరుతాయి అనే దానిని దృష్టిలో పెట్టుకొని, కార్యకర్తల సమక్షంలోనే, వారి సుముఖతతో బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మంచింది.
కార్యకర్త నుంచి నాయకులుగా ఎదిగిన వారందరూ ఆయా గ్రామాల్లో, మండలాల్లో ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలను తన స్థాయిలో పరిష్కరిస్తూ, వారిలో మమేకమై ఉన్నప్పుడే వారికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మరింత సేవ చేసేందుకు ప్రయత్నించాలి. ప్రధానంగా ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తుంది. అధికారంలో ఉన్నాం, తాము ఏం చేసినా చెల్లుతుందని ధోరణితో ఉంటే పార్టీ మనుగడపై దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుంది. పార్టీ పునాదులు కదులుతాయి.. మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కష్టసాధ్యం అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కిందిస్తాయి నుంచి ప్రక్షాళన అవసరమే. గ్రామాల్లో పార్టీ పేరు చెప్పుకొని, అధికారంలో ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ మాదే అని రంగులు మార్చే ఫైరవీకారులు, కాంట్రాక్టర్లు, స్వయంప్రకటిత నాయకులుగా చలామణి అవుతున్న వారికి కాకుండా నిజమైన కార్యకర్తలకు అవకాశం వస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగితే ఏ పార్టీకైనా మంచి భవిష్యత్ ఉంటుందనడంలో సందేహం లేదు.