Telangana Congress: భారత క్రికెట్ టీం సాధించిన విజయాలలో.. 1983 ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. కపిల్ దేవ్ నాయకత్వంలో ఆడిన భారత జట్టుపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. కనీసం బ్యాట్లు కొనేందుకు జట్టు దగ్గర డబ్బులు లేవు. చివరికి గెలిచిన తర్వాత చల్లుకునే షాంపేన్ బాటిళ్లు కొనుగోలు చేసేందుకు కూడా బయట అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి. జింబాబ్వే మీద గెలిచిన భారత జట్టు.. పడుతూ లేస్తూ ఫైనల్ దాకా వెళ్ళింది. అరి వీర భయంకరమైన, అప్పటికే రెండుసార్లు వరల్డ్ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టు పైన విజయం సాధించింది. ఈ విజయంతో ఒకసారిగా టీమిండియా రూపురేఖలు మారిపోయాయి.. బ్యాట్లు కొనేందుకు డబ్బులు లేని బీసీసీఐ.. ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా 1983 ఇండియన్ క్రికెట్ జట్టు లాగానే ఉంది. దాదాపు పది సంవత్సరాలుగా అధికారానికి దూరమైంది. కీలకమైన నేతలందరూ తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. అటు కేంద్రంలో కూడా అధికారంలో లేదు. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ చేసిన పనుల వల్ల పార్టీ ప్రాభవాన్ని కోల్పోయింది. దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూపింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఇదంతా గమనిస్తున్న తెలంగాణ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఇక దాదాపుగా అయిపోయిందనేది అర్థమైంది.. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఢిల్లీలోని అధినాయకత్వం పట్టించుకోకపోవడం కూడా ఇందుకు ఒక కారణమైంది.
ఎడారిలో తిరుగుతున్నప్పుడు.. దప్పికతో బాధపడుతున్నప్పుడు ఒయాసిస్ కనిపిస్తే ఎలా ఉంటుందో.. కర్ణాటకలో సాధించిన విజయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలా ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో ఉరకలెత్తే ఉత్సాహంతో పనిచేసే బూస్ట్ ఇచ్చింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి మీద ఆగ్రహంగా ఉండి బయటికి వచ్చిన నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తాజాగా తుమ్మల నాగేశ్వరరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. వంటి వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారంతా దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే.. వేలాది దరఖాస్తులు రావడమే దీనికి ఉదాహరణ. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయకుండా భారతీయ జనతా పార్టీ నాన్చుడు ధోరణి అవలంబించిన నేపథ్యంలో దీనిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. క్షేత్రస్థాయిలో బిజెపి, బీఆర్ఎస్ ఒకటే అనే విధంగా ప్రచారం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది.
ఇక వరుసగా ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి వారితో సభలను నిర్వహించింది. త్వరలో సోనియాగాంధీతో హైదరాబాదులో మరొక సభ నిర్వహించేందుకు సమయత్తమవుతోంది. అధికారంలో లేని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేతలని లాగేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. త్వరలో మరింత దూకుడుగా వ్యవహరించాలని రంగం సిద్ధం చేసుకుంది. మొత్తానికి 1983లో అండర్ డాగ్ గా బరిలోకి దిగి వరల్డ్ కప్ సాధించిన ఇండియా జట్టు ఎలాగైతే చరిత్ర సృష్టించిందో.. రేవంత్ నాయకత్వంలో తాము కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.