Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో.. ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. స్థానిక ఎన్నికల కంటే ముందే అక్కడే ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే వేగంగా అడుగులు వేస్తోంది. జూబ్లీహిల్స్ లో భారత రాష్ట్ర సమితి తరఫునుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారు. సహజంగా ఇక్కడ పోటీ కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్య ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఈ రెండు పార్టీల అభ్యర్థులే జోరు చూపిస్తున్నారు.
గులాబీ పార్టీ అభ్యర్థి ఖరారు కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అనే ఉత్కంఠ ఇప్పటివరకు కొనసాగింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనేకమంది ఆశావహులు రంగంలో ఉన్నారు. క్రికెటర్ అజారుద్దీన్, ఇంకా కొంతమంది తమ తమ ప్రయత్నాలు చేశారు. అదే అజరుద్దీన్ ను తెలివిగా ముఖ్యమంత్రి తప్పించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పోటీ నుంచి లేకుండా చేశారు. ఇక మిగతా వారిపై కూడా అదే స్థాయిలో రేవంత్ తన స్టైల్ రాజకీయం ప్రదర్శించారు. దీంతో రేవంత్ కు తిరుగులేకుండా పోయింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునుంచి నవీన్ యాదవ్ కు టికెట్ లభించినట్టు తెలుస్తోంది. అధికారికంగా మరికొద్ది క్షణాల్లోనే ప్రకటిస్తారని సమాచారం. నవీన్ యాదవ్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. స్థానికంగా ఈయనకు మంచి పేరు ఉంది. పైగా విద్యాధికుడు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం.. కలిసి వస్తాయని తెలుస్తోంది. దీనికి తోడు కవిత కూడా తన తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రెఫరెండం అని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించడం విశేషం.