Cold Wave In Telangana: మొన్నటిదాకా వర్షాలు దంచి కొట్టాయి.. ఇప్పుడు సముద్రాలలో ఎటువంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేదు. వాయుగుండాలకు ఆస్కారం లేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలపై వాతావరణం మరో విధంగా ప్రభావం చూపిస్తోంది. మొన్నటిదాకా వర్షాల వల్ల అంతగా చలిగాలులు వీచలేదు. ఇప్పుడు మబ్బులు ఏర్పడడం లేదు. దీంతో చలిగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను వణికిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఉమ్మడి హైదరాబాద్ వరకు చలి పులి జనాలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని.. సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉండాలని సూచించింది. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. గురువారం ఉదయం కల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో 10 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ కు, నార్త్ వెస్ట్ తెలంగాణలో ఏడు నుంచి పది డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ శీతాకాలంలో ఇదే అత్యంత “శీతల రాత్రి” అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
సముద్రాలలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేకపోవడం.. వాయు గుండాలకు ఆస్కారం లేకపోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని అధికారులు చెబుతున్నారు. పైగా ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయని.. హిమాలయ ప్రాంతాల నుంచి చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయని.. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అత్యంత చల్లగా మారిందని అధికారులు చెబుతున్నారు.. ఇలాంటి వాతావరణంలో బయటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటివి సోకే ప్రమాదం ఉన్నందున ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.
ఈ తరహా శీతల వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఉంటుందని.. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. చలి గాలులు కూడా వీస్తాయని అధికారులు చెబుతున్నారు.. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత వల్ల హైదరాబాదులో గాలి నాణ్యత చాలా వరకు తగ్గింది. ఉదయం పూట మంచు దట్టంగా కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు..