HomeతెలంగాణCM Revanth Reddy Warning: ఆ మంత్రులకు రేవంత్‌ వార్నింగ్‌.. పదవి ఊస్ట్‌!?

CM Revanth Reddy Warning: ఆ మంత్రులకు రేవంత్‌ వార్నింగ్‌.. పదవి ఊస్ట్‌!?

CM Revanth Reddy Warning: తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్‌ సమావేశం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం(అక్టోబర్‌ 23న) జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కొందరు మంత్రుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తన కొనసాగితే చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం.

అధికారులను బయటకు పంపించి..
కేబినెట్‌ సమావేశంలో ఎజెండా చర్చ ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌ అధికారులను సమావేశం నుంచి బయటకు పంపించారు. తర్వాత మంత్రులతో సుమారు గంటన్నరపాటు అంతర్గతంగా చర్చించారు. ఈ సమయంలో మంత్రుల మధ్య విభేదాలు, ఎక్సైజ్‌ శాఖ వివాదం, కొండా సురేఖ–ఓఎస్‌డీ వ్యవహారం, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కుటుంబాలను ఈడొచ్చదని హెచ్చరిక..
వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయం నేపథ్యంలో జరిగిన పరిణామాలపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యుల పేర్లు లాగడంపై ఒక మంత్రిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ ‘‘తప్పు అర్థం వచ్చినందున తొందరపడ్డాం’’ అని చెప్పినట్లు సమాచారం.

క్షమాపణలతో చల్లారిన వాతావరణం
సీఎం హెచ్చరికల తర్వాతే కొండా సురేఖ రాత్రి జరిగిన మీడియాతో మాట్లాడారు. ‘‘నా కుమార్తె వ్యాఖ్యల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి బాధ కలిగితే క్షమించండి’’ అని తెలిపారు. ఇదే సంఘటనపై జూపల్లి కృష్ణారావు కూడా ‘‘రిజ్వీ వీఆర్‌ఎస్‌కి నేను పంపిన లేఖతో ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు. ఈ పరిణామాలతో కొంతకాలంగా కొనసాగుతున్న మంత్రుల మధ్య ఉద్రిక్తతలు కొంత సమసిపోయినట్లు కనిపిస్తోంది.
ఎన్నికల వ్యూహం.. బీసీ రిజర్వేషన్లపై చర్చ..
ఇదే సమావేశంలో తదుపరి ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని సీఎం రేవంత్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల ప్రభావం, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న చట్టపరమైన అంశాలు చర్చించారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల వ్యూహాన్ని సమష్టిగా రూపొందించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

మొత్తంగా మంత్రుల వ్యవహార శైలిపై సీఎం రేవంత్‌ ఇచ్చిన కఠిన సందేశం ప్రభుత్వం అంతర్గత సమన్వయాన్ని పునరుద్ధరించేందుకు ప్రారంభమైన చర్యగా కనిపిస్తోంది. ఇటీవలి వివాదాలు, విభేదాలకు ముగింపు పలకడం ద్వారా రాజకీయ ఇమేజ్‌ కాపాడుకోవాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత జరిగే కేబినెట్‌ సమావేశమే ఈ మార్పుల ఫలితాలను ప్రతిబింబిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular