CM Revanth Reddy: మంత్రులకు శాఖలపై పీఠముడి.. ఢిల్లీకి రేవంత్.. ఏం జరుగనుంది?

ఎల్బీనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కి గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక కోణంలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 8, 2023 5:50 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో తన క్యాబినెట్ కు తుది రూపు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ప్రజాదర్బార్ మధ్యలోనే ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు దేశ రాజధానికి వెళ్లిన అనంతరం మంత్రివర్గం పై తుదికూర్పు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. అయితే గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మినహా మిగతా వారందరికీ మంత్రి పదవులు లభించాయి. అయితే ఆ మంత్రి పదవిలో రంగారెడ్డి జిల్లాకు ఒక స్పీకర్ పదవి మినహా హైదరాబాద్, మెదక్ నేతల భాగస్వామ్యం అందులో లేదు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో చెప్పుకో తగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా పరిగణలోకి తీసుకుందని తెలుస్తోంది.

ఎల్బీనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కి గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక కోణంలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మధుకి హైదరాబాద్ జిల్లా కోనల్లో పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ కు కూడా మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజహారుద్దిన్, నిజాంబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలికి సముచిత ప్రాధాన్యం లేదా ఏదైనా మంత్రి పదవులు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ నేతలు ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కేవలం మంత్రి పదవులు మాత్రమే కాకుండా డిప్యూటీ స్పీకర్, విప్, లను కూడా నియమించే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. అయితే ఇంకా శాఖలు ఖరారు కాకపోయినప్పటికీ దాదాపు సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఉన్న విభాగాలనే కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా రెవెన్యూ శాఖను, నీటిపారుదల శాఖను, విద్యుత్ శాఖను రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే నాయకులకే కేటాయించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ శాఖలోనే భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అలాంటప్పుడు అధికారంలో ఉంది గనుక గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలను కచ్చితంగా ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అందుకే ఈ శాఖలను తనకు దగ్గరగా ఉండే వ్యక్తులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద గట్టిగా పట్టుపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వస్తే గాని మంత్రివర్గం కూర్పు పై ఒక అంచనా ఏర్పడదు.