CM Revanth Reddy: తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తోంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో రేవంత్ సర్కార్ జాప్యం చేస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరుపాలని దాఖలైన పిటిషన్లను విచారణ చేసి హైకోర్టు.. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే మొదట హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఇప్పుడు నిర్వహించలేమని చేతులు ఎత్తేసింది. ఇందుకు రిజర్వేషన్ల పెంపును సాగుకుడా చూపుతోంది. ఢిల్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. ఈ నెల 30 లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు సంబంధించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదాలు ఆలస్యమవుతున్నందున తీర్పు వచ్చే వరకు ఎదురుచూడాలని పేర్కొన్నారు. ‘
బీసీ రిజర్వేషన్ బిల్లు..
స్థానిక ఎన్నికలు ఆలస్యమవడానికి ప్రధాన కారణం బీసీలకు 42 శాతం కేటాయింపు బిల్లు. అసెంబ్లీలో ఆమోదించబడిన ఈ చట్టానికి గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ఇంకా సంతకం చేయలేదు. కేంద్రం కూడా అడ్డుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 30లోపు ఎన్నికలు జరపాలని ఉన్నప్పటికీ, 50 శాతం మించే రిజర్వేషన్‌లు చట్టవిరుద్ధమనే సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయి. ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశంపై విస్తృత సమీక్షలు చేస్తోంది. రిజర్వేషన్ ఖరారు లేకుండా ఎన్నికలు నిర్వహించడం రాజకీయంగా ప్రమాదకరమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే గ్రామ పంచాయతీలు, జెండీపీసీలు వంటి స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేస్తోంది.
నేతల్లో నిరాశ.. ఆశావహుల్లో ఆందోళన
సీఎం ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలోని స్థానిక నాయకులు, ఎన్నికల అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికలు ఆలస్యమైతే పార్టీల మధ్య పోటీలు ప్రభావితమవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పింఛన్ల పెంపు లేకపోవడంతో గ్రామీణులు అసంతృప్తితో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా జాప్యం జరుగుతోంది. యూరియా కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల ఆలస్యంతో అధికార పార్టీకే నష్టమన్న అభిప్రాయం ఉంది. ఆర్థిక భారం, చిన్న పార్టీల పోటీలు పెరగడం వల్ల కాంగ్రెస్ బలహీనపడవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
పంచాయతీ ఎన్నికల ఆలస్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు రిజర్వేషన్‌ల ద్వారా బీసీల మద్దతు సాధించాలనే లక్ష్యం, మరోవైపు హైకోర్టు ఆదేశాలు, కేంద్ర ఆటంకాలు ప్రభుత్వాన్ని బలహీన స్థితిలో ఉంచాయి. ఎన్నికలు ఆలస్యమైతే, గ్రామీణ ఓటర్లలో అసంతృప్తి పెరగవచ్చు. విపక్షాలు దీన్ని ప్రచారంగా మలిచుకోవచ్చు. బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్‌ను ‘ఎన్నికల భయం‘తో ఆరోపిస్తోంది. భవిష్యత్తులో, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు జరిగితే, రిజర్వేషన్‌లు సమతుల్యంగా రూపొందించడం కీలకం. లేకపోతే, స్థానిక పాలనలో అంతరాయాలు పెరిగి, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.