Revanth Reddy latest decision: 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana chief minister Revanth Reddy) జిల్లాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తద్వారా కొత్త జిల్లాల సంఖ్య తగ్గిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. అది కాస్త తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు సరిగా లేదని.. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. పరిపాలన విషయంలో అవాంతరాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. తద్వారా జిల్లాల విషయంలో రేషన్లైజేషన్ (పునర్వ్యవస్థీకరణ) చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన మాటల ప్రకారం కొన్ని జిల్లాలు రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది..
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు ఉండేవి. అవి కాస్త 33 జిల్లాలుగా మారిపోయాయి. అయితే కొన్ని జిల్లాలను రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేశారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలుగా విభజించాలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాలని.. అభివృద్ధిని ఏకీకృతం చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని ఉద్యమాలు ప్రారంభమైన నేపథ్యంలో.. వాటికి వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. ఇంకా చాలా చోట్ల కూడా ఇదే తరహాలో ఉద్యమాలు మొదలయ్యాయి.
ఇటీవల అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు తో పాటు మరో ఆరు జిల్లాలను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది.. చిన్న జిల్లాలను పక్కన ఉన్న పెద్ద జిల్లాలలో విలీనం చేస్తారని తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైనట్టు సమాచారం. కొన్ని జిల్లాలకు పేర్లు కూడా మారుస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఫ్యూచర్ సిటీ జిల్లాకు జయపాల్ రెడ్డి పేరు పెడతారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33 జిల్లాలు ఏర్పాటు కాగా.. వాటిని 23 కు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇన్నాళ్లకు తాను చేస్తున్న ప్రకటనకు కట్టుబడి ఉండే విధంగా రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. గతంలో కూడా ఆయన పార్లమెంట్ నియోజకవర్గం ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే 23 జిల్లాలకు తగ్గిస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు ప్రయోజనం పొందుతుంది? ప్రజల నుంచి వచ్చే నిరసనను ఏ విధంగా తట్టుకుంటుంది? అనేది చూడాల్సి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు
కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాం
వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం https://t.co/ssJBhtdWK5 pic.twitter.com/Cvl3kgfkGX
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026