CM Revanth Reddy govt schemes: ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ మంత్రాన్ని జపించడం ఇటీవల కాలంలో మనదేశంలో పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే రాష్ట్ర అన్ని ఇదే మంత్రాన్ని సాగిస్తున్నాయి. సంక్షేమ పథకాలు కొంతవరకు సమంజసమే. కాకపోతే ఇవి స్థాయి దాటిపోతే ప్రభుత్వ ఖజానా మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్లే సాధ్యమైనంతవరకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు కేటాయింపులను తగ్గించుకోవాలని గతంలో ఆర్థికవేత్తలు అనేక సందర్భాల్లో సూచించారు.
ఈ కథనం ప్రారంభంలో చెప్పినట్టు కొన్ని పథకాలు మాత్రం ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయి. అటువంటి పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఇది కాస్త, ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. మిగతా పథకాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం కాస్త ఇప్పుడు మానవీయ కోణంలో ఉంది. సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారికి ఆలంబనగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దివ్యాంగులను ఇతరులు వివాహం చేసుకుంటే ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రెండు లక్షల ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, విద్య, ఉద్యోగుల భర్తీలో వారికి కోటా అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. వారికి ప్రభుత్వం తరఫున చేయుత అందించడానికి 50 కోట్లతో ఉపకరణాలు కూడా అందిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను, ఇతర ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని ఆత్మ స్థైర్యంతో ఎదగాలని ముఖ్యమంత్రి సూచించారు.
దివ్యాంగులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నప్పటికీ.. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా వివాహానికి రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించలేదు.. తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని వీలైనంత తొందరలో అమలు చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో దివ్యాంగులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. విద్య, ఉద్యోగాలలో సత్తా చూపిస్తున్నప్పటికీ వారు సమాజం దృష్టిలో ఇప్పటికి హేళన ఎదుర్కొంటున్నారు. వారిలో భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.