CM Revanth Reddy : తెలంగాణలో 2018 నుంచి అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు రైతుంబంధు పేరుతో పెట్టుబడి సాయం అందించింది. పరిమితితో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్ సర్కార్.. రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి అందించింది. గత రబీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మందికి పెట్టుబడి అందించింది. అయితే గడిచిన ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి అందడం లేదు. పెట్టుబడి సాయంపై పరిమితి విధించాలని రేవంత్ సర్కార్ భావించింది. ఈమేరకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఖరీఫ్ కాలం పూర్తయినా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఖరీఫ్ పెట్టుబడి లేకుండానే సాగింది. ఇక ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది. ఈనేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవైపు విపక్షాలు రైతుబంధు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. రబీ పంటలకు అందించాల్సిన రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
త్వరలో విధి విధానాలు..
రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏరాపటు చేసిన కేబినెట్ సభ్ కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే అంశంపై త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించి.. విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాతే రుణ మాఫీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని సమాచారం.
రూ.21 వేల కోట్ల రుణ మాఫీ..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రూ.2 లక్షల లోపురుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గత ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసింది. తాజాగా నాలుగో విడతలో మరో రూ.3 వేల కోటుల మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా చెల్లింపు జాప్యం జరిగింది.
పంచాయతీ ఎన్నికలపై ప్రభావం..
రైతు భరోసా చెల్లింపు ఆలస్యంపై రైతుల అసంతృప్తితో ఉన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ కూడా సన్న వడ్లకే ఇస్తున్నారు. దీంతో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నారు.