Railways Act:నిల్యం దేశంలో లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది రైల్వే శాఖ. ఎప్పటికప్పుడు అధునాతన సర్వీసులతో ప్రయాణికుల కోసం తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో వందే భారత్ రైలు సర్వీసులు ప్రయాణికులకు మెరుగైన భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలను అందిస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఆ రైళ్లపై తరచూ రాళ్ల దాడి జరిగిన ఘటనలను గురించి వార్తలను వింటూనే ఉన్నాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాయి విసిరారని తరచూ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.. అయితే రైళ్లపై రాళ్ల దాడి జరిగితే ఉన్న చట్టాలు ఏమిటో తెలుసా? రైలుపై రాయి విసిరే ధైర్యం చేస్తే ఎంతటి శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది ? రైళ్లపై రాళ్లు రువ్వకుండా భారత ప్రభుత్వం చాలా కఠినమైన చట్టాన్ని కలిగి ఉంది. కాబట్టి మీరు కనుక ఇలా చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి.
రైల్వే చట్టంలోని సెక్షన్ 152, 153 ప్రకారం రైలుపై రాళ్లు రువ్వే నేరస్థులకు జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇది కాకుండా, రైల్వే చట్టంలో అనేక ఇతర సెక్షన్లు ఉన్నాయి. దీని కింద రైల్వే ఆస్తికి సంబంధించిన నేరాలలో శిక్ష విధించే నిబంధన ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 166 (బి) ప్రకారం, రైలులో బిల్లులు అతికిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఇది కాకుండా, రైల్వే చట్టంలోని సెక్షన్ 141 ప్రకారం, చైన్ పుల్లింగ్‌లో పట్టుబడితే, వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం, రైలు పట్టాలపై కూర్చోవడం లేదా అడ్డంకులు ఏర్పాటు చేయడం, రైల్వే హోస్‌పైప్‌లను ట్యాంపరింగ్ చేయడం లేదా సిగ్నల్‌లను పాడు చేయడం ద్వారా రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 2,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. రైల్వే చట్టంలోని సెక్షన్ 146 మరియు 147 ప్రకారం, రైల్వే ఉద్యోగులను వారి పనిలో అడ్డుకోవడం లేదా అక్రమంగా రైల్వేలోకి లేదా దానిలోని ఏదైనా భాగంలోకి ప్రవేశించడం వలన ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి.