CM Revanth Reddy : అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితాలు అమలు చేయాలంటే ప్రభుత్వాలకు డబ్బులు కావాలి. ఆ డబ్బులను రాబట్టుకునేందుకు ప్రభుత్వ భూములు అమ్మడం.. లేదా మద్యం పై పన్నులు పెంచడం.. రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం.. వంటి వాటిని పాలకులు చేపడుతున్నారు. తద్వారా ధరల స్థాయి పెరిగి.. సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఒక రకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి.. ప్రజల మీదే పన్నుల భారం మోపుతున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇందులో ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అని తేడా లేదు. అన్నీ ఆ జాబితాకు చెందినవే.
అసలు విషయం చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. దానిని అమలు చేస్తున్నారు కూడా. మొత్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడం వల్ల ప్రభుత్వం పై ప్రతి ఏడాది వందల కోట్ల భారం పడుతోంది. అయితే ఈ విషయాన్ని పక్కనపెట్టి గత ప్రభుత్వం వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రవీంద్ర భారతి లో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి సంచలన వ్యాఖ్యలు చేశారు..” తెలంగాణ రాష్ట్రంలో నాలుగు విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా దివాళా తీసి.. కుప్పకూలే దుస్థితిలో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయాయని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అనుకున్నప్పుడు.. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని.. తద్వారా విద్యుత్ తయారీ సంస్థల పుట్టి ఎందుకు ముంచుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తారా? లేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. “గత ప్రభుత్వం తాము అధికారంలోకి రావడానికి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అంటూ గొప్పలు చెప్పింది. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు పోయింది. కానీ వాస్తవానికి 14 గంటలకు నుంచి కరెంటు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీగా అవకతవకలకు పాల్పడింది. కొత్త విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ అడ్డగోలుగా అవినీతి చోటుచేసుకుంది. వీటన్నింటినీ పరిష్కరిస్తుందని భావించినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే చేస్తోందని.. రెండు ప్రభుత్వాలకు పెద్దగా తేడా లేదని” రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
తెలంగాణలో ఇవాళ విద్యుత్ సంస్థలు పూర్తిగా దివాళా తీసి, కుప్పకూలే పరిస్థితి వచ్చి.. వేల కోట్ల రూపాయిల అప్పుల్లో మునిగి పోయాయి – రేవంత్ రెడ్డి pic.twitter.com/ubH8j6wtWK
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2025