CM Revanth Reddy: గతంలో అంటే కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలంలో ప్రగతిభవన్లో ఏదైనా విలేకరుల సమావేశం నిర్వహించారు అంటే కచ్చితంగా రాహుల్ పేరు వినిపించేది. అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదేపదే రాహుల్ పేరు ప్రస్తావించేవారు. ఇంతకీ ఈ రాహుల్ ఎవరయ్యా అంటే.. ఆయన పేరు పొందిన ఓ ఆంగ్ల దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్. వార్తలు బాగా రాస్తాడు అనే పేరు ఉంది. పైగా ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆయన సీఎం బీట్ చూస్తూ ఉంటాడు. కెసిఆర్ కు ఎప్పటినుంచో పరిచయస్తుడు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న పోరాటం గురించి రాహుల్ తన పత్రికలో ప్రముఖంగా రాసేవాడు. తనకు ఎంతోమంది జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి రిపోర్టర్లు తెలిసినప్పటికీ ఎందుకనో కేసీఆర్ రాహుల్ తో అటాచ్మెంట్ పెంచుకున్నాడు. కెసిఆర్ తీరే అంత కదా.. బాగుంటే నెత్తిన పెట్టుకుంటాడు. బాగోలేకపోతే కింద పడేస్తాడు. అంతటి కరోనాకాలంలో విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు రాహుల్ తోనే ఎక్కువగా మాట్లాడేవాడు. ఆమధ్య బీజేపీపై యుద్ధం ప్రకటించినప్పుడు రాహుల్ నువ్వు ఈ వార్త బాగా రాయాలని అందరి ముందు బాహాటంగా అనేశాడు. సో కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంతో రాహుల్ బాగా పాపులర్ అయ్యాడు. సరే ఇప్పుడు కెసిఆర్ అధికారాన్ని కోల్పోయాడు. హైదరాబాదులోని నంది హిల్స్ లో తన సొంత ఇంటికి పరిమితమయ్యాడు. ఇక సెక్రటేరియట్, ప్రగతి భవన్ లో ఒకవేళ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం నిర్వహిస్తే అప్పటి స్థాయిలో సందడి ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని కొనసాగించే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకున్నారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఓ దివ్యంగురాలైన మహిళ తన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించింది. అయితే ఎంతకీ న్యాయం జరగకపోవడంతో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను కలిసింది. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఆమె సమస్యను పట్టించుకుంటే ఈ రోజున ఆమె కేటీఆర్ ను కలిసే అవకాశం ఉండేది కాదు. పైగా ఇప్పుడు రేవంత్ అధికారంలో ఉన్నాడు.. ఆయన ఎప్పుడు చిక్కుతాడు అని ఆలోచిస్తున్న కేటీఆర్ కు ఆ దివ్యాంగురాలు సమస్య ఒక అస్త్రంగా దొరికింది. రెండో మాటకు తావు లేకుండా కేటీఆర్ ఆమెకు లక్ష రూపాయలు సహాయం చేశాడు. ఇంకేముంది తెల్లారి నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. కేటీఆర్ చేసిన లక్ష రూపాయల సహాయాన్ని ప్రశంసిస్తూ కథనం ప్రచురితమైంది. సహజంగానే దీని గులాబీ మీడియా తెగ ప్రమోట్ చేసుకుంది. గులాబి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీనిని ట్రోల్ చేసింది.
ఇదే విషయాన్ని ఈరోజు సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాహుల్ తీసుకొచ్చారు. అయితే అంతకుముందు కేటీఆర్, హరీష్ రావును విమర్శిస్తూ మాట్లాడిన రేవంత్ రెడ్డి కొంచెం బ్రేక్ తీసుకొని.. రాహుల్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒకసారిగా సభలో నవ్వులు, పువ్వులు విరిసాయి. ఎందుకంటే అప్పట్లో రాహుల్ ను కెసిఆర్ అదే విధంగా సంబోధించారు. కెసిఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా రాహుల్ పేరును ప్రస్తావించారు. దీంతో తోటి జర్నలిస్టు మిత్రులంతా కమాన్ రేవంత్ రెడ్డి అన్న అనగానే ఒక్కసారిగా ఆయన ఒక నవ్వు నవ్వారు. అంతేకాదు కేటీఆర్ లక్షల కోట్లు దోచుకుతిన్నారని.. ఇందులో ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తే తప్పులేదని రేవంత్ సమర్థించుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ కొన్ని సూచనలు చేశారని.. వాటిని కచ్చితంగా నోట్ చేసుకొని అమలయ్యే విధంగా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మొత్తానికి కేసీఆర్ కంటే భిన్నంగా రాహుల్ పేరు ప్రస్తావించడంతో విలేకరుల సమావేశం కాస్త సందడిగా మారింది. అయితే మునుముందు రోజుల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద వ్యతిరేక వార్తలు రాయాలని రాహుల్ ను కోరినా ఆశ్చర్యం లేదని సెక్రటేరియట్ పాత్రికేయ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో.. రేవంత్ రెడ్డి ఎలా నవ్వులు పూయిస్తారో..