CM Revanth Reddy: ప్రధాన వార్త పత్రికల్లో రెండు మినహా మిగతావన్నీ రేవంత్ ఫోల్డ్ లోకి వచ్చినట్టే. ఇక చానల్స్ లో కూడా ఒకటి రెండు మినహా మిగతావన్నీ అతడికి దగ్గరైనట్టే. స్థూలంగా చూస్తే గత కెసిఆర్ లాగానే కనిపిస్తోంది. మీడియా అండదండలు ఉంటేనే గవర్నెన్స్ బాగుంటుందని రేవంత్ కూడా అర్థమయి ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వేమూరి రాధాకృష్ణను కలిశాడు. వేమూరి రాధాకృష్ణ కూడా దాదాపు రెండు గంటల పాటు ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత తన పత్రికలో మూడు పేజీల్లో వార్తలు కుమ్మేశాడు. ఎలాగూ టిడిపి పాత కాపు, పైగా చంద్రబాబుకు దగ్గరి దోస్తు.. అందువల్లే రాధాకృష్ణ దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు మరింత దగ్గర వాడయ్యాడు. ఒక రకంగా తన పత్రికలో రేవంత్ కు విశేష ప్రాధాన్యమిస్తున్నాడు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తర్వాత రేవంత్ రెడ్డి ఈనాడు రామోజీరావు వద్దకు వెళ్లారు. రామోజీరావు తన గతానికంటే భిన్నంగా ఒక సాధారణ కుర్చీలో కూర్చుని.. ముఖ్యమంత్రి కి మాత్రం కనకపు సింహాసనం వేశారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య మార్గదర్శికి సంబంధించిన చర్చ వచ్చినట్టు సమాచారం. మార్గదర్శి మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కాస్త చూడాలని కోరినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఎవరు వచ్చినా ఒక మెట్టు పైనే ఉండే రామోజీరావు.. రేవంత్ రాగానే రెండు మెట్లు దిగారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రామోజీరావు తర్వాత గురువారం రేవంత్ రెడ్డి ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని కలిశారు. నరేంద్ర చౌదరితో చాలాసేపు మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన భేటీని ఎన్టీవీ చాలాసేపు ప్రసారం చేసింది. గతంలో ఎన్టీవీ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేది అనే వాదన వినిపించింది. కెసిఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత.. కచ్చితంగా అధికార పార్టీ అండ ఉండాలని ఉద్దేశంతోనే.. రేవంత్ అనుకూల వార్తలు ప్రసారం చేస్తోందనే విమర్శలున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వద్దకు వెళ్లారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి, ఓ లీడింగ్ ఛానల్ ఎండి వద్దకు వెళ్లాడు అంటే దాన్ని అంత తేలిగ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీడియా చాలా అవసరం. తను సొంతంగా ఛానల్ పెట్టలేడు. పత్రిక నడపలేడు. అంటే ఉన్నవారి సాయం కోరుతాడు. వారికి కూడా తప్పదు. ప్రభుత్వ నుంచి ప్రకటనలు రావాలన్నా, ఇతర పనులు కావాలన్నా అణిగి మణిగి ఉండక తప్పదు. గత పది సంవత్సరాలు తెలుగునాట ముఖ్యంగా తెలంగాణలో మీడియా చేసింది అదే కదా.. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తోంది. పార్టీ వేరు, జెండా వేరు, ముఖ్యమంత్రి వేరు, చేసే పని మాత్రం ఒక్కటే. దానికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం.
ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఇంటికి లంచ్కి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు. pic.twitter.com/qUIJPFbazp
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2024