CM Revanth Reddy Meet MLA Donthi Madhava Reddy: ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కింగ్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన కింద పనిచేయాల్సిందే. నేటి కాలంలో ఒక ముఖ్యమంత్రి మాటను జవదాటే సాహసం ఎవరూ చేయలేరు. పైగా కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలు గెలిచినవారు.. వాటిని ఏదో ఒక రూపంలో సంపాదించుకోవడానికి రకరకాల పరిచయాలతో ముందడుగులు వేస్తుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే మాత్రం పూర్తి డిఫరెంట్. ఎన్నికల్లో భారీగానే ఖర్చుపెట్టి గెలిచినప్పటికీ.. ఆయన మంత్రి పదవి మీద కన్నేశారు. అధిష్టానం వద్ద తన పలుకుబడిని భారీగానే ఉపయోగించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. సీనియర్ నాయకుడైన తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఆయన మొదటి నుంచి కూడా ఆగ్రహం గానే ఉన్నారు. ఆగ్రహాన్ని అనేకమార్లు ప్రదర్శించారు. చివరికి ముఖ్యమంత్రి తన జిల్లాకు పర్యటించడానికి వచ్చినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే అడుగు బయట పెట్టలేదు.. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఆ ఎమ్మెల్యే పేరు దొంతి మాధవరెడ్డి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నర్సంపేట. నర్సంపేట నియోజకవర్గం లో 2014, 2018 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితం వచ్చింది. 2023 లో మాత్రం ఊహించని ఫలితం కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో విజయవంతమయ్యారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీలో దొంతి మాధవరెడ్డి సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అన్ని విధాలుగా ముందడుగు వేశారు. కార్యకర్తలలో ఆత్మస్థైర్యం తగ్గకుండా ఉండడానికి భారీగానే ఖర్చు పెట్టుకున్నారు. కేసులు కూడా ఎదుర్కొన్నారు. కార్యకర్తల తరఫున అనేక పోరాటాలు చేశారు. అప్పటి ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ నిలబడగలిగారు. చివరికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను మంత్రిగా నియమించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ కార్యకర్తలు కూడా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కొండా సురేఖ, సీతక్కకు మంత్రి పదవులు రావడంతో మాధవరెడ్డి ఒకరకంగా నారాజ్ అయ్యారు. అనేక పర్యాయాలు అధిష్టానానికి తన బాధను చెప్పుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయన పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రితో మాధవరెడ్డికి విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో మాధవరెడ్డి మాతృమూర్తి కాలం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన ఖర్మను బుధవారం కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం హాజరై దొంతి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంతి మాధవరెడ్డి ఫైర్ బ్రాండ్ లీడర్ కావడంతో.. నేరుగా ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్తున్నారు. మాధవరెడ్డిని పరామర్శించబోతున్నారు. ఇలా అలకపాన్పు ఎక్కిన మాధవరెడ్డిని సీఎం పరామర్శతో కూల్ చేయనున్నారన్న మాట.. ఒక ఎమ్మెల్యే కోసం ఏకంగా సీఎం రావడం అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పరంగా.. పార్టీ పరంగా కాంగ్రెస్ అటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మాధవరెడ్డి ఒక్క అడుగు కూడా వేయలేదు. ఎవరికి ముఖ్యమంత్రి వరంగల్ వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాధవరెడ్డి హాజరు కాలేదు. చివరికి ఇన్ని రోజులకు మాధవరెడ్డి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్లడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఈ పరామర్శతోనైనా మాధవరెడ్డి అలకపాన్పు వీడుతారా? ముఖ్యమంత్రి ఆయనకు ఎటువంటి హామీ ఇస్తారు? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.