Visakhapatnam Investments: ఏపీ ప్రభుత్వం( AP government) రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆకర్షించింది. నవ్యాంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు సర్కార్ ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా విశాఖలో ఐటి అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో.. గూగుల్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. నవ్యాంధ్రప్రదేశ్ కు నవ శకం.
* విశాఖకు ప్రాధాన్యం..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు ఎంతో ప్రాధాన్యం దక్కుతోంది. ముఖ్యంగా దిగ్గజ ఐటీ పరిశ్రమలు విశాఖ వైపు చూస్తున్నాయి. కూటమి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకాలు, రాయితీలు పెద్ద ఎత్తున దక్కుతుండడంతో ఐటీ దిగ్గజ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థ ముందుకు వచ్చింది. అమెరికా తర్వాత ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతుండడం ఈ రాష్ట్ర గర్వ కారణం. దేశం విశాఖ వైపు చూసేందుకు ఇది దోహదపడే ఒక ప్రయోగం. అది కూడా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చొరవతో భారీగా ఐటి పరిశ్రమలు విశాఖకు వస్తుండడం నిజంగా గర్వకారణం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంకోవైపు ప్రపంచ ఐటి దిగ్గజ పరిశ్రమలు విశాఖకు తొంగి చూస్తుండడం నిజంగా హర్షించదగ్గ పరిణామం.
* ఢిల్లీలో కీలక ఒప్పందం..
ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా గూగుల్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. వచ్చే నెలలో విశాఖలో పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు జరగనుంది. అంతకుముందే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఒప్పందం జరగడం మాత్రం ఏపీకి శుభ పరిణామం. ఇప్పటికే చాలా డేటా సెంటర్లు విశాఖలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు గూగుల్ సంస్థ రావడంతో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చేందుకు దోహదం కలిగింది. అయితే విశాఖకు ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ఎవరు ఊహించలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. కానీ ఎటువంటి ముందడుగు వేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే దిగ్గజ పరిశ్రమలతో పాటు సంస్థలను తీసుకొచ్చి తన చతురతను చాటుకుంది.