Jogi Ramesh Fake Liquor Case: ఏపీలో( Andhra Pradesh) కల్తీ మద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ పెద్దలే కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ కల్తీ వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలుగుదేశం కూటమి చెబుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రను బయటపెట్టింది. దొంగే దొంగ అన్నట్టు పక్కా ప్రణాళికతో జోగి రమేష్ ఇదంతా చేయించారని నమ్ముతోంది. అందుకే ఇప్పుడు జోగి రమేష్ పై ఫుల్ ఫోకస్ చేసింది. వాస్తవానికి జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంకోవైపు చంద్రబాబు విషయంలో అనుకూల ప్రకటనలు చేశారు. ముఖ్యంగా వైసిపి హయాంలో చంద్రబాబు భార్యను శాసనసభలో దూషించడం తప్పు అని ఒప్పుకున్నారు. తమ ఇళ్లల్లో మహిళలు సైతం దానిని సహించుకోలేకపోయారని బహిరంగంగా చెప్పుకొచ్చారు. అయినా సరే జోగి రమేష్ విషయంలో కూటమి నమ్మలేదు. అయితే ఇప్పుడు అదే జోగి రమేష్ నకిలీ మధ్యలో అసలు సూత్రధారి అని తెలియడం సంచలనంగా మారింది.
* అధికారంలో దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో 100 కార్లతో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు జోగి రమేష్. ఆయన అప్పట్లో కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ను మంత్రిగా పదోన్నతి కల్పించారు. మంత్రి అయిన తరువాత దూకుడుగా వ్యవహరించారు జోగి రమేష్. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన తీరు అభ్యంతరకరంగా ఉండేది. చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో ఆయన వ్యవహార శైలి అతిగా ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు చెల్లుబాటు అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ పై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబ పాత్ర బయటపడింది. ఆ కేసులో రమేష్ కుమారుడు, సమీప బంధువులు అరెస్టయ్యారు కూడా. అయితే వెనువెంటనే ఈ కేసుల మాఫీ కోసం జోగి రమేష్ టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. టిడిపి నేతలతో వేదిక పంచుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ ఆది నుంచి జోగి రమేష్ విషయంలో టిడిపి అనుమానంతోనే ఉంది. ఉద్దేశపూర్వకంగానే అప్పట్లో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు టిడిపి నేతలతో హాజరయ్యారు జోగి రమేష్. దానిపై టిడిపి శ్రేణుల్లోనే దుమారం రేగింది. చివరకు జోగి రమేష్ తో వేదిక పంచుకున్న నేతలు వివరణ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్ళింది. అప్పుడు కూడా జోగి రమేష్ ద్వారా వైసీపీ రాజకీయ కుట్రకు పాల్పడిందని రేగిన అనుమానాలకు.. తాజాగా కల్తీ మద్యం కుట్రతో మరింత బలపడింది.
* ఇది కూడా ప్లాన్ ప్రకారమేనా?
చిత్తూరు జిల్లా ( Chittoor district) తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు గ్రామంలో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఆ మరుసటి రోజు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ ను సాక్షి మీడియాతో కలిసి వెళ్లి బయటపెట్టారు జోగి రమేష్. తంబళ్లపల్లెలో వెలుగు చూసిన నకిలీ మద్యం ఘటన మరువక ముందే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ వాలిపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ గతంలో తమతో నకిలీ మద్యం తయారు చేయించాడని.. ఇప్పుడు కూడా ఈ ప్లాన్ వెనుక ఆయన హస్తం ఉందని.. మమ్మల్ని ఇరికించి పక్కకు తప్పుకోవడం వల్లే తాము స్పందించాల్సి వచ్చిందని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తద్వారా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణను అడ్డంగా పెట్టుకుని రాజకీయ కుట్రకు జోగి రమేష్ పాల్పడ్డారని ఇప్పుడు టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. అయితే ఇటువంటి నేతలు ఏపీలో ఎంతమంది ఉన్నారనే దానిపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జోగి రమేష్ విషయంలో కూటమి ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఆయన పై ఎలాంటి కేసులు నమోదు చేస్తారో???